అలంపూర్ చౌరస్తా, ఫిబవరి 4 : మోసపూరిత హామీలు ఇచ్చి తెలంగాణలో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభు త్వం రైతులను నట్టేట ముంచిందని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరుపై అలంపూర్ నియోజకవర్గ రైతులు ఆగ్రహించారు. మంగళవారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కంది కొనుగోళ్ల తీరుపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. వీరికి బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్యతోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కుర్వ పల్లయ్య రైతులతో కలిసి మాట్లాడారు. మార్కెట్లో కందులకు ధర పడిపోవడంతో మద్దతు ధరకు కొనుగోలుపై కేంద్రం అనుమతి ఇచ్చింది.
అయితే ఎకరానికి మూడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రాష్ట్రంలో సగటు దిగుబడి ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని, టీడీఆర్ 59రకంతో అలంపూర్ రైతులు ఎకరాకు 10 క్వింటాళ్లు వరకు పండించారని అన్నారు. అయితే సర్కార్ మాత్రం ఎకరానికి మూడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడంతో మిగతా 7 క్వింటాళ్లు రైతులు ఎక్కడ అమ్ముకోవాలంటూ ప్రశ్నించారు. దీనిపై తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి కొనుగోలు పరిమితిని ఎకరానికి 3 నుంచి 6 క్వింటాళ్ల వరకు పెంచాలని ప్రభుత్వానికి లేఖలు రాయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వేరుశనగ, మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఈ పంటల ధరలు బాగా పడిపోవడంతో కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత సంవత్సరం మిర్చి క్వింటా రూ.25 వేలు పలుకగా ఈ సీజన్లో రూ.12 వేలకు పడిపోయిందని వాపోయారు. వేరుశనగకు కూడా గడిచిన పదేండ్లలో ఎప్పుడు ఇంత తక్కువ ధర లేదని, మద్దతు ధర రూ.6.783 వేలు ఉండగా వ్యాపారులు రూ.3 నుంచి 5 వేలు ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే అన్ని పంటకు మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ మోహన్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, రామాంజనేయులు, తులసీగౌడ్, ఉరుకుందు, మాధవ్, అలంపూర్ నియోజకవర్గ రైతులు పాల్గొన్నారు.