రేవంత్ సర్కారుపై కర్షకన్న కన్నెర్ర చేశాడు. రైతు భరోసాపై కొర్రీలు పెట్టడాన్ని నిరసిస్తూ సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రోడ్లపైకి చేరుకొని ఆందోళనకు దిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట మేరకు ఎకరాకూ రూ.15 వేల రైతు భరోసా అందించాలని పెద్ద ఎత్తున నినాదించారు. దీంతో ఆయా పట్టణాలు, గ్రామాలు ధర్నాలతో దద్దరిల్లాయి. రైతు భరోసా ఎకరాకూ రూ.12 వేలు ఇస్తామనడంపై ఆగ్రహ జ్వాలలు రాజుకున్నాయి.
వనపర్తి జిల్లా పెద్దగూడెం చౌరస్తాలో డిక్లరేషన్ పత్రాలను మంటల్లో దహనం చేశారు. సమీపంలోని వరి పొలంలో కూలీలు గులాబీ నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. నాగర్కర్నూల్, నారాయణపేట, మహబూబ్నగర్ జోగుళాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ ఆందోళనలు జోరుగా సాగాయి. పలువురు గులాబీ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికార దాహం కోసం 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. ఆరుగాలం కష్టపడి అన్నదాత లు పంటలు పండిస్తే తమను కాంగ్రెస్ సర్కారు కొర్రీల పేరుతో మోసం చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతు, కూలీలకు రూ.12 వేల ఇస్తామని చెప్పి నేడు ఊసెత్తడం లేదని దుయ్యబట్టారు. అలాగే అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తింపజేయకుంటే ఆందోళన తప్పదని వారు హెచ్చరించారు.
– మహబూబ్నగర్, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)