గద్వాల, డిసెంబర్ 8 : తెలంగాణ రాష్ట్రంలో రైతులకు చేయూత నిచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గట్టు మండలం రాయపురం గ్రామానికి చెందిన రైతు మారెప్ప మృతి చెందగా ఆయన భార్య సువార్తమ్మకు గత ప్రభుత్వం నుంచి మంజూరైనా రూ.5 లక్షల చెక్కును శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారికి చేయూత నిచ్చారని తెలిపారు.
రైతులు అభివృద్ధి చెందాలంటే వారికి ఆర్థిక చేయూత నివ్వాలనే ఉద్దేశంతో వారి కోసం 24గంటల ఉచిత కరెంట్ ఇవ్వడంతో పాటు రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ తదితర పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలిచారని తెలిపారు. దీంతో పాటు రైతులు పండించిన పంటను దళారులకు అమ్మి రైతులు మోసపోకుండా ఉండాలనే మంచి ఆలోచనతో రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారు పండించిన పంటకు మద్దతు ధర కల్పించారని వివరించారు. ఆయన రాష్ర్టానికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రవీణ్, ఎంపీటీసీ రంగస్వామి, బీఆర్ఎస్ నాయకులు రాముడు, గోవిందు, సిద్ధు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.