గద్వాల, మే 28 : మిల్లర్ ధాన్యం మిల్లులో దింపుకోవడం లేదంటూ గట్టు మండలం తప్పెట్లమొర్సు గ్రామానికి చెందిన రైతు ధాన్యం ట్రాక్టర్‌తో వచ్చి కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే గట్టు మండలం తప్పెట్లమొర్సు గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు తనకు ఉన్న ఎకరన్నర పొలంలో వరి పంట సాగు చేశారు. వరి ధాన్యం శుద్ధి చేసిన తర్వాత ధాన్యం కొనుగోలు చేయాలని గట్టులోని కొనుగోలు సెంటర్ వద్దకు శాంపిల్ తీసుకెళ్లారు.
తేమ శాతం పరిశీలించిన సెంటర్ నిర్వాహకులు ధాన్యం తూకం వేసుకొని నేరుగా మాచర్లలోని మి ల్లుకు తీసుకెళ్లాల్సిందిగా 50 గన్నీ బ్యాగులు ఇచ్చి పం పారు. రైతు 47సంచుల ధాన్యాన్ని కాంటా వేసుకొని కొ నుగోలు సెంటర్ నిర్వాహకుడు చెప్పిన విధంగా వరి ధా న్యాన్ని రైతు మిల్లు దగ్గరకు తీసుకెళ్లారు. మిల్లు యజమా ని ధాన్యం బాగలేదని ధాన్యాన్ని మిల్లులో దించుకోనని నీ ధాన్యం దిబ్బలో పోసుకో అని వెటకారంగా మాట్లాడినట్లు రైతు తెలిపారు. హామాలీతోపాటు ట్రాన్స్‌పోర్టు ఖర్చు భరించి మేమే ధాన్యం మిల్లు దగ్గరకు తీసుకెళ్తే మిల్లు యజమాని దురుసుగా ప్రవర్తించినట్లు రైతు వాపోయారు.
మీరు తెచ్చిన ధాన్యం మిల్లు ఆడిస్తే నూకలు వస్తాయని అందువల్ల నేను మిల్లులో దించుకోనని చెప్పడంతో ఆగ్రహించిన రైతు నేరుగా ధాన్యం నింపిన బస్తాలను తీసుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు చేరుకొని కలెక్టర్‌కు తన గోడును వెళ్లబోసుకోవడానికి వచ్చారు. ఆరుగాలం రైతు కష్టపడి పంట పండిస్తే దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదన్న చందంగా కొనుగోలు సెంటర్ నిర్వాహకులు ధాన్యం మంచిగా ఉందని సంచులు తీసుకెళ్లి ధాన్యం నేరుగా మిల్లుకు తీసుకుపోవాలని చెబితే మిల్లర్ మాత్రం ధాన్యం బాగలేదనే సాకుతో మిల్లులో దింపుకోకుండా వేధించడంతో చేసేది లేక కలెక్టరేట్ వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశాడు.
ఇలాంటి దుస్థితి ఎప్పుడూ రాలేదు
పదేండ్లలో ఇలాంటి దుస్థితి రైతులకు ఎప్పుడు రాలేదు. కేసీఆర్ హయాంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి, ధాన్యాన్ని మిల్లులకు తరలించి వెంటనే ఖాతాల్లో నగదు జమ చేసేవారు. ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం, నగదు చెల్లింపుల్లో ఆలస్యం చేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. కొనుగోలు సెంటర్ నిర్వాహకులు ధాన్యం బాగుందని చెబితేనే సంచులకు నింపి మిల్లుకు తీసుకొచ్చా. అక్కడికెళ్లాక ధాన్యం బాగా లేదంటున్నారు. ఈ ఇబ్బందులు చాలా మంది రైతులు ఎదుర్కొంటున్నారు. న్యాయం చేయాలని కోరుతూ ధాన్యం ట్రాక్టర్‌ను కలెక్టరేట్‌కు తీసుకొచ్చా. న్యాయం చేసే వరకు ఇక్కడే ఉంటా.
– శ్రీనివాసులు, రైతు, తప్పెట్లమొర్సు