మహబూబ్‌నగర్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎరువుల కోసం వచ్చిన ఓ రైతు ఫిట్స్ వచ్చి కుప్పకూలిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. శనివారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఎరువుల విక్రయ కేంద్రం వద్దకు నవాబ్‌పేట మండలం కాకర్లపాడుకు చెందిన రైతు ఆంజనేయులు తెల్లవారుజామునే వచ్చి క్యూలో నిలబడ్డాడు. తెల్లారితే ఎరువులు ఇస్తారని ఆశతో అక్కడే ఉన్న ఆయన కొద్దిసేపటి తర్వాత ఫిట్స్‌తో పడిపోయాడు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫిట్స్ వచ్చిన రైతును కాపాడేందుకు స్థానికులతో కలిసి ప్రయత్నించారు.
చివకు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా.. అర్ధగంట తర్వాత తాపీగా వాహనం వచ్చింది. వెంటనే రైతును అందులో స్థానిక ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించారు. అప్పటికే రెండు సార్లు మూర్ఛపోయినట్లు అక్కడి రైతులు ఆయనకు తెలిపారు. ఇదంతా మీడియా సాక్షిగా అందరూ చూస్తుండగానే జరిగింది.. కాగా ఎరువుల కొరత ఉన్నదని, రైతులతో మాట్లాడేందుకు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెళ్లారని తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు హుటాహుటిన పోలీసులను పంపించి హైడ్రామాకు తెరలేపారు. ఇక్కడే అసలు డ్రామా మొదలైంది.. రైతు కాదని బుకాయించే ప్రయత్నం చేశారు.
ముందుగా పోలీసులను గవర్నమెంట్ దవాఖానకు పంపించారు.. దవాఖానలో సదరు రైతుకు తాను రైతు కాదని.. చెప్పాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఈలోపు కాంగ్రెస్ నేతలు హంగామా చేస్తూ.. పడిపోయింది రైతు కాదని చెప్పేందుకు నానా తంటాలు పడ్డారు.. ఈ క్రమంలో పడిపోయింది రైతు కాదని ముందుగా రిక్షా డ్రైవర్ అన్నారు.. ఆ తర్వాత ఆటో డ్రైవర్ అని అబద్ధాలు వల్లించారు. అయితే శ్రీనివాస్‌గౌడ్ మాత్రం కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ చిట్టా విప్పే రోజు త్వరలో వస్తుందన్నారు. రైతుల ఉసురు పోసుకొన్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. యూరియా కొరత లేకుండా చూడాల్సిన కాంగ్రెస్ నాయకులు కళ్లముందు ఇంత జరుగుతున్నా.. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.