Rythu Bharosa | నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ రైతు తనకు రైతు భరోసా రాకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. తన సేవింగ్స్ ఖాతా గల బ్యాంకు ముందు తన బైక్కు నిప్పు పెట్టిన సంఘటన తెలకపల్లి మండల కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు శాఖ ముందు సోమవారం జరిగింది.
తెలకపల్లి మండలం గోలగుండం గ్రామ రైతు మొల్ల స్వామి తల్లి నిరంజనమ్మ పేరు మీద 2.15 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. వ్యవసాయం చేయడానికి తెలకపల్లిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఆమె పట్టాదార్ పాస్ పుస్తకం పెట్టి రుణం తీసుకున్నాడు. వడ్డీతోపాటు కలిపి అప్పు రూ. లక్ష దాటింది. ఇటీవల రుణమాఫీలో భాగంగా రూ.95 వేలు మాఫీ కాగా, ఇంకా బ్యాంకులో రూ.13,000 అప్పు కట్టాల్సి ఉంది. రైతు పట్టా పాస్ బుక్ అవసరమై బ్యాంకుకు వెళ్లి అడిగాడు. బ్యాంకు అధికారులు ఇంకా రూ.13,000 అప్పు ఉందని అవి చెల్లించి పాసుబుక్ తీసుకెళ్లాలని సూచించారు.
దీంతో రైతు భరోసా పడి ఉంటే అప్పు తీరడంతోపాటు తన పాసుబుక్ ఇచ్చేవారని భావించాడు. రైతు భరోసా రానందుకే బ్యాంకు అధికారులు తనకు పాసుబుక్ ఇవ్వడం లేదంటూ మనస్థాపానికి గురై తన బైక్కు నిప్పు పెట్టాడు. దీంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పి రైతు స్వామిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.