అచ్చంపేట రూరల్, నవంబర్ 13 : పంటకు సరిపోను కరెంట్ సరఫరా కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి తాళం వేసిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. స్థానిక రైతుల కథనం మేరకు.. అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన రైతు రాత్లావత్ శక్రునాయక్ 9 నెలలుగా సరిపడా, నాణ్యమైన కరెంట్ అందకపోవడంతో తాను సాగు చేసిన వేర్వేరు పంటలు దిగుబడి తగ్గిందని వాపోయాడు. శక్రునాయక్కు రెండెకరాల పొలం ఉండగా.. మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని వేరుశనగ పంట సాగు చేశాడు.
అయితే రైతు బోరుకు కరెంట్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్పై లోడ్ అధికంగా పడుతుండడంతో లోవోల్టేజీతో మో టర్ నడిచేది కాదు. ఈ విషయాన్ని గతంలోనూ విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో రై తు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోసారి లైన్మెన్ శంకర్‌కు సమాచారమివ్వగా.. జూన్యర్ లైన్మెన్ సీతారాంను అక్కడకు పంపించాడు. రైతుకు అతను నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఏబీ స్విచ్ ఆఫ్ చేసి తాళం వేశాడు.
ఈ విషయాన్ని ఏఈ ఆంజనేయులుకు తెలియజేయగా సాయంత్రం 6 గంటల సమయంలో జూనియర్ లైన్మెన్ను పంపించారు. రైతుతో మాట్లాడినా వినలేదు.. ఏఈతోపాటు ఉన్నతాధికారులు వచ్చి తనకు స్పష్టమైన హామీ ఇస్తేనే తాళం తీస్తానని చెప్పడంతో ఏఈకి సమాచారం ఇవ్వగా.. గురువారం వెళ్దామని చెప్పడంతో కరెంట్ ఉద్యోగి అక్కడి నుంచి వెనుదిరిగాడు. కాగా తాళం అలాగే ఉండడంతో పలువురు రై తులు ఆందోళన చెందుతున్నారు. తాళం వేసి 24 గంటలు గడిచినా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్ పరిధిలో ఉన్న దాదాపు 70 ఎకరాల్లో సాగైన పంటలు నీళ్లులేక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని 20 మంది రైతులు వాపోయారు. కాంగ్రెస్ వచ్చాకే తమకు కరెంట్ కష్టాలు మళ్లా మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.