వనపర్తి, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : అన్నదాతలకు అండగా నిలుస్తామన్న కాంగ్రెస్ మాటలు నీటిమూలయ్యా యి. పంట రుణమాఫీ, రైతుభరోసా పెంపు హామీలతో రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక రైతుభరోసాకు రాంరాం పాడ గా, రూ.2లక్షల్లోపు రుణమాఫీని కొందరికే చేసి చాలా మంది రైతులను నిండాముంచారు. 30శాతం కూడా మాఫీ చేయకపోవడంతో వనపర్తి జిల్లా రైతాంగం తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉంది. ఇక రైతుభరోసాను వానకాలం సీజన్లో పూర్తిగా నిలిపి వేసినట్లు ఇటీవలే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడంతో రైతులకు ప్రభుత్వ పరిస్థితి పూర్తిగా అర్థమైంది.
ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ చేశామని ప్రకటించింది. అయితే, జిల్లాలో వివిధ కారణాలతో ఇంకా వేలాది మందికి రుణమాఫీ కాలేదు. అర్హత ఉండి మాఫీ కాని రైతులు గతంలో పలుచోట్ల ఆందోళనలు చేశారు. మాకెందుకు మాఫీ చేయరంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికీ ఇంకా జిల్లాలో అక్కడక్కడా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో రైతు కుటుంబాల నిర్ధారణ అంటూ గ్రామ స్థాయి సభలు చేపట్టారు. అయినా ఇంత వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ పథకం అమలు జరగలేదు. ఇదిలా ఉండగా, అన్ని రకాల సమస్యలను పరిగణలోకి తీసుకుంటే దాదాపు 10వేల మంది రైతులు అర్హత ఉండి కూడా రుణమాఫీ అందుకోలేదన్న అంచనా ఉంది.
ప్రతి సీజన్లో ఎకరాకు రూ.7,500లు రైతుభరోసా పథకం ద్వారా ఇస్తామన్న హామీ పూర్తిగా ఆటకెక్కింది. రెండు సీజన్లకు కలిపి రూ.15వేలు అందిస్తామంటే రైతన్నలు నమ్మకంతో ఎదురు చూశారు. సాగుకోసం సాయం అందించాల్సిన రైతుభరోసా వానకాలం పంట చేతికి వచ్చినా దిక్కులేకుండా పోయింది. చివరకు వానకాలం సీజన్ రైతుభరోసా ఇవ్వలేమని స్వయంగా వ్యవసాయశాఖ మంత్రి చెప్పడం రైతుల్లో మరింత ఆగ్రహావేశాలు పెంచేలా చేశాయి.
వానకాలం సీజన్ ముగిసినప్పటికీ పంట రుణాలివ్వడంలో అధికారులు రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పించుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 30శాతం కూడా రుణాల పంపిణీ జరగలేదంటే బ్యాంకుల పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతున్నది. జిల్లాలో పంట రుణ లక్ష్యం రూ.3454.92 కోట్లుండగా, మార్చి నుంచి సెప్టెంబర్ వరకు 51,991 మంది రైతులకు రూ.539.68కోట్లు ఇచ్చారు. ఈ లెక్కన సగం లక్ష్యం కూడా దాటని పరిస్థితి నెలకొన్నది.
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు, రైతుల పక్షాన నిలబడి భరోసానిచ్చేలా బీఆర్ఎస్ రైతు నిరసన సదస్సుకు శ్రీకారం చు ట్టింది. వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట సమీపంలో పాలకేంద్రాన్ని అనుసరించి మైదానంలో సదస్సు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
రైతుల నిరసన సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభాస్థలిని ఏర్పాటు చేయాలని, అవసరమైన వసతులు కల్పించాలని నాయకులకు సూచించారు. ముందుగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అక్కడి నుంచి రైతు లు, నాయకులు ర్యాలీగా సభాస్థలికి చేరుకునేలా ఏర్పాట్లు చేశా రు. బీఆర్ఎస్ నాయకులు అభిలాష్‌రావు, గట్టు యాదవ్, వాకి టి శ్రీధర్, పలుస రమేశ్‌గౌడ్, అశోక్, విష్ణు, హేమంత్, శ్రీను, రాము, జోహెబ్, హుస్సేన్, క్రాంతి తదితరులు మాజీ మంత్రి వెంట ఉన్నారు.