గట్టు, మార్చి 16 : మండలంలోని ఇందువాసికి చెం దిన ముత్తయ్య పట్టాదారు. ఇతడికి ఇందువాసి శివారులో 385/బీ/1 సర్వేనెంబర్లో ఎ.5.18గుంటల భూమి ఉన్నది. ముత్తయ్య చాలాకాలం కిందట మృతిచెందినా కూడా 09-03-2019న మృతిచెందినట్లు మరణ ధ్రువీకరణ పత్రం పొందారు. ఇతడి భార్య లూసమ్మ, పెద్ద కుమారుడు, పెద్ద కుమార్తెలు ఇంజన్న, పెద్ద ఇంజమ్మ మృతిచెందగా, ప్రకాశ్, నడిపి ఇంజమ్మ, చిన్న ఇంజమ్మ ఉన్నారు. పొలాన్ని ఇతరులకు కౌలుకు ఇచ్చిన ముత్తయ్య సంతానం చెట్టుకొకరు, గుట్టకొకరన్నట్లుగా వేర్వేరు ప్రాంతాల్లో ఉపాధి పొందుతూ కాలం వెళ్లదీస్తున్నారు.
దాయాదుల సంతానంలో ఒకరైన ఇందువాసికే చెందిన హెచ్.విజయ్ కొందరి సహకారంతో ముత్తయ్య పొలం కైంకర్యానికి పన్నాగం పన్నాడు. తన తండ్రి ఆధార్‌ను ఇంజన్న అలియాస్ ముత్తయ్యగా మార్పిడి చేయించుకొని అసలైన పట్టాదారు ముత్తయ్య ఆధార్నెంబర్ను లింక్ చేయించాడు. అధికారులతో ముత్తయ్యకు తామే వారసులమంటూ హెచ్.విజయ్ తన పేరుతోపాటు తన తల్లి సుశీలమ్మ బతికున్నా కూడా మరణించినట్లు కుటుంబ ధ్రువీకరణ పత్రం(ఎఫ్ఎంసీ) పొందాడు. అయితే తాసీల్దార్‌గా సరితారాణి పనిచేస్తున్న సమయంలోనే 16-11-2024 న ఈ ధ్రువీకరణ పత్రం జారీకావడం ఇక్కడ కొసమెరుపు. అయితే ఈ ధ్రువీకరణ పత్రం జారీపై అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్లాట్ బుక్ చేసుకున్న సదరు వ్యక్తులు విరాసత్‌కు వెళ్లారు. అయితే ఈ సమయంలో పట్టాదారు కుటుంబ సభ్యులతోపాటు, స్థానికులు కొందరు ఇది అక్రమ విరాసత్ అని, తప్పుడు ఫ్యామిలీ మెంటర్ సర్టిఫికెట్ పొంది పట్టా మార్పిడి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, గట్టిగా తేల్చిచెప్పడంతో విరాసత్ ఆగింది. అయితే ఈ విరాసత్‌కు ఇంకా పావులు కదువుతున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, తమ పన్నాగం బెడిసికొట్టడంతో అక్రమ విరాసత్‌కు పూనుకున్న సదరు వ్యక్తి తన తండ్రి ఇంజన్న అలియాస్ ముత్తయ్య, నిజమైన పట్టాదారు ముత్తయ్య ఆధార్‌తో నెలకొన్న లింక్‌ను తొలగించాలని తాసీల్దార్‌కు ఈనెల 7వ తేదీన వినతిపత్రం అందించాడు. లింక్ కారణంగానే తప్పిదం జరిగినట్లుగా ఇందులో తన ప్రమేయం ఏమీలేదన్నట్లుగా నిరూపించుకోవడానికి సదరు వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ అక్రమ విరాసత్పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అసలు పట్టాదారు ముత్తయ్య కుమారుడు ప్రకాశ్ తెలిపారు. ఈ వ్యవహారాన్ని సోమవారం తేల్చనున్నట్లు ఎస్సై హామీ ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.
సంబంధం లేని వ్యక్తుల పేరిట ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ అయిన విషయాన్ని గుర్తించాం. ఇది గత తాసీల్దార్ కాలంలో జరిగింది. దీన్ని రద్దు చేయించడానికి ఆర్డీ వో, కలెక్టర్ కార్యాలయాలకు లేఖలు పంపించాం. త్వరలోనే ఇది రద్దవుతుంది. ఈ విరాసత్ ఎట్టి పరిస్థితుల్లో జరుగకుండా చర్యలు తీసుకుంటాం.
– సలీముద్దీన్, తాసీల్దార్, గట్టు