మల్దకల్, అక్టోబర్ 14 : మహబూబ్నగర్ జిల్లా రామిరెడ్డిగూడెం వద్దనున్న ఎస్సీ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ప్రియాంక బాత్రూంలో సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. ప్రియాంక మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం మల్దకల్కు తీసుకొచ్చారు. అయితే ప్రియాంక మృతికి గ్రామానికి చెందిన యువకులే కారణమని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం గద్వాల-అయిజ రహదారిపై మృతదేహంతో గంటపాటు రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. గ్రామానికి చెందిన కొందరు యు వకులు రెండ్రోజుల కిందట కారులో తమ కూతురు చదువుకుంటున్న చోటుకు వెళ్లి బ యటకు రావాలని భయపెట్టారని తెలిపారు. ఈ విషయం తమకు చెప్పకుండా భయంతో అఘాయిత్యానికి పాల్పడిందని కన్నీరుమున్నీరయ్యారు. యువకులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకొన్న డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను, ఎస్సై నందికర్ సిబ్బందితో అక్కడకు చేరుకొని కుటుంబ సభ్యులను సముదాయించారు. కారణమైన యువకుడిని రప్పించాలని పట్టుబట్టడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. ఎమ్మెల్యే అక్కడకు చేరుకొని యువకులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.