అమరచింత, ఏప్రిల్ 8 : ప్రసవం కోసం ప్రభుత్వ దవాఖానలకు వెళ్లిన మహిళకు వైద్యులు, సిబ్బంది సకాలంలో వైద్యం అందించకపోవడంతో ప్రైవేట్ దవాఖానను ఆశ్రయించినా గర్భశోకం తప్పని దారుణ ఘటన ఆత్మకూర్‌లో చోటు చేసుకున్నది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అమరచింత మండలంలోని చంద్రఘడ్‌కు చెందిన అనిత ప్రసవం కోసం అమరచింత ప్రభుత్వ దవాఖానకు వచ్చింది.
డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్ (వసంత) ప్రసవం కోసం వచ్చిన మహిళను పరీక్షించి ఇంజక్షన్ ఇచ్చి సెలెన్ బాటిల్ పెట్టి ప్రసవం చేసే ప్రయత్నం చేయగా శిశువు కాళ్లు మాత్రమే బయటకు రావడంతో కాన్పు కష్టతరం అవుతున్నదని గుర్తించి ఇక్కడ వైద్యులు కూడా అందుబాటులో లేరని వెంటనే వనపర్తిలోని ఎంసీహెచ్‌కు తీసుకుపోవాలని రెఫర్ చేసింది. దీంతో కుటుంబ సభ్యులు గర్భిణిని అక్కడి నుంచి 108లో వనపర్తి తరలిస్తుండగా పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో నేరుగా ఆత్మకూర్ ప్రభుత్వ దవాఖానకు తీసుకుపోయారు.
అక్కడ కూడా పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాల్సి వస్తుందని వెంటనే వనపర్తి జిల్లా దవాఖానకు తీసుకుపోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు వనపర్తికి వెళ్లకుండా పట్టణంలోని ప్రైవేట్ దవాఖానను ఆశ్రయించారు. అప్పటికే శిశువు తల మినహా మొండెం వరకు పూర్తిగా బయటకు రావడంతో అందుబాటులో ఉన్న వైద్యులు పరీక్షించి గైనకాలజిస్టు విజయలక్ష్మిని పిలిపించి ఆపరేషన్ చేసి తల మొండెం వేరు చేసి శిశువును బయటకు తీశారు.
రెండు ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ దవాఖానను ఆశ్రయించిన మహిళలకు గర్భశోకం తప్పలేదు. అమరచింతలోని ప్రభుత్వ దవాఖానలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఆత్మకూర్లోనూ అదే పరిస్థితి నెలకొందని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తాము తమ శిశువును కాపాడుకోలేక పోయామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రైవేట్ దవాఖానలో వైద్యం వికటించి శిశువు మృతి అంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ కావడంతో డీఎంహెచ్‌వో శ్రీనివాసులు దవాఖానకు వచ్చి బాధితులు, వైద్యుల నుంచి వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం దవాఖానపై తగిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో వెల్లడించారు.
ఈ విషయంపై ప్రైవేట్ దవాఖానకు చెందిన వైద్యుడు సుబ్బారెడ్డిని వివరణ కోరగా పురిటి నొప్పులు రావడంతో రెండు దవాఖానలకు తిరిగి మధ్యరాత్రి 12:20కి తమ దవాఖానకు వచ్చిన అనితకు అప్పటికే శిశువు పూర్తిగా బయటకు వచ్చి కేవలం తల మాత్రమే మిగిలిపోయిందని, వనపర్తి వెళ్లేందుకు లేటు అవుతుందని, తల్లినైనా కాపాడాలని కుటుంబ సభ్యులు ప్రాదేయపడడంతో వైద్యుల సూచనతో తమ దవాఖానలో చేర్చుకొని ప్రసవం చేసి తల్లిని కాపాడినట్లు ఆయన తెలిపారు.