మహబూబ్‌నగర్ కలెక్టరేట్, అక్టోబర్ 14 : రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ చివరి వారంలో ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరించింది. వాటిలో ఆన్లైన్ చేసిన దరఖాస్తుల్లో ఎక్కువగా రేషన్‌కార్డులకు సంబంధించినవే ఉన్నాయి. వీటికి మోక్షం లభించలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తామని మరోసారి ప్రకటించింది. తీరా అది కూడా నోచుకోకపోవడంతో వేలాదిమంది నిరుపేదలకు నిరాశే మిగిలింది.
జిల్లాలో ఎంపిక చేసిన మున్సిపల్ వార్డులు, పంచాయతీల్లో ‘ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే’ పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. ఇది ఈనెల 8వ తేదీతో ముగిసింది. దీని తర్వాతైనా దరఖాస్తులు స్వీకరిస్తారేమోనని చాలా మంది ఆశగా ఎదురుచూ స్తున్నా.. కొత్త కార్డులు సైతం జారీ చేయడం లేదు. మృతిచెందిన వారి పేర్లు రేషన్‌కార్డుల్లో వాటంతటవే తొలిగిపోయేలా సాఫ్ట్వేర్ ఏర్పాటు చేశారు. కానీ, పుట్టిన వారి పేర్లు మాత్రం చేర్చడం లేదు. ఉమ్మడి కుటుంబాలు వేరు సంసారం పెట్టినా కొత్త కార్డులు ఇవ్వడం లేదు.
ప్రజాపాలన ప్రభుత్వం అంటూ గొప్పలు చెబుతూనే పేదల నోటికాడి కూడును లాగేస్తుందని ఉమ్మడి జిల్లా ప్రజలు వాపోతున్నారు. ఆహారభద్రత (రేషన్) కార్డులు, కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో కొలువుదీరాక.. పేదలకు అన్ని రకాలుగా అండగా ఉండడమే తమ ఎజెండా అంటూ ప్రగల్భాలు పలికింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహారభద్రత కార్డులు జారీ చేస్తామంటూ చెప్పినా.. ఆ దిశగా ముందుకు సాగకపోగా.. ఉన్న కార్డుల్లోనూ కోత విధిస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి న ఈ పది నెలల కాలంలో 2,539 కార్డులు రద్దు కాగా.. 39,740 మంది కుటుంబ సభ్యుల పేర్లు తొలగించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 63 రేషన్‌కార్డులు, 2,399 కుటుంబ సభ్యుల పేర్లు తీసివేశారు.
ఈ చిత్రంలో ఉన్న అతడి పేరు రవి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మేకలబండ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతడికి భార్య శాంతిప్రియ, ముగ్గు రు పిల్లలు ఉన్నారు. రేషన్‌కార్డు ఉన్నా.. అందులో భార్య పేరు లేదు. ఈ నేపథ్యంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సమయంలో తన భార్య పేరును ఆహారభద్రత కార్డులో చేర్చాలని అప్లికేషన్ సమర్పించినా.. ఆన్లైన్లో నమోదు కాలేదు.