మిడ్జిల్, నవంబర్ 15 : బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. మిడ్జిల్ మండల కేంద్రంలో కొంతమంది యువకులు పాలమూరు యూనివర్సిటీ విద్యార్థుల (నిరుద్యోగులం) మాటున సీఎం కేసీఆర్కు ఓటు వేయొద్దని కరపత్రాలు పంచుతుడంగా బీఆర్ఎస్ యువనేతలు పట్టుకొని వారిని ప్రశ్నించారు. దీంతో వాళ్లు అసలు యూనివర్సిటీ విద్యార్థులు కాదని తేలింది. కాంగ్రెస్ నాయకులు తప్పుడు కరపత్రాలు ముద్రించి కొంతమంది యువకులకు కూలీ డబ్బులు చెల్లించి బీఆర్ఎస్పై అసత్య ప్రచారాలు చేయిస్తున్నట్లు బయటపడింది. సీఎం కేసీఆర్ను నేరుగా ఎదుర్కోలేకే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు.
బీఆర్ఎస్ నాయకులు వారి వద్ద నుంచి కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగగా.. ఘర్షణ వాతావరణం నెలకొన్నది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలతో మాట్లాడి సమస్య పెద్దది కాకుండా చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఓటమి భయంతోనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు సుధాబాల్రెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు జంగిరెడ్డి తెలిపారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేయలేరన్నారు. ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.