మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జడ్చర్ల, అక్టోబర్ 13 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కలిసిమెలిసి తిరిగిన సహచర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శేఖర్‌ను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకుంటున్నారన్న సమాచారంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పరోక్షంగా సీఎంను టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే సీఎంకు సన్నిహితుడుగా మెలిగిన శేఖర్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్లో చేరారు. తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చాక రేవంత్‌తో టచ్‌లోనే ఉన్నట్లు గుసగుసలు ఉన్నాయి.
అవకాశం వచ్చినప్పుడు వద్దువులే అని సీఎం చెప్పారని.. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తిరిగి తీసుకురావాలని సీఎం వర్గీయులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పిస్తూ కొరకరాని కొయ్యగా మారారు. శేఖర్‌ను తిరిగి తీసుకువస్తే అనిరుధ్‌రెడ్డికి చెక్ పెట్టవచ్చని కొందరు అధికార పార్టీ నాయకులు సూచించడంతో ఆయన పార్టీలో చేరుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఏకంగా డీసీసీ అధ్యక్ష పదవితోపాటు స్థానిక ఎన్నికలు జరిగితే జెడ్పీ చైర్మన్ పదవి కూడా ఇచ్చేందుకు సీఎం హామీ ఇచ్చినట్లు ఆయన వర్గీయులు చర్చించుకుంటున్నారు. ఇక ఆయన చేరిక లాంచనమే అని తెలిసి ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సంచుల మోసేవాళ్లు మా పార్టీకి అక్కర్లేదని మాజీ ఎమ్మెల్యేను ఉద్దేశించి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని చంపిన వ్యక్తిని మా పార్టీలోకి తీసుకోం ఎందుకంటే రేపు ఎమ్మెల్యే టికెట్ కావాలని నన్ను కూడా చంపిన చంపవచ్చు అందుకోసం నేను సీఎంను కలిసి జెడ్ కేటగిరి భద్రత అడుగలేను కదా అని అసహనం వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా ఫ్యాక్షనిస్టులకు మా పార్టీలో స్థానం లేదని, సీఎం రేవంత్‌కు, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఓ క్లారిటీ ఉందని చెప్పుకొచ్చారు.
ఇది వరకే కాంగ్రెస్‌లోకి వస్తానని గాంధీ భవన్‌కు వచ్చినా ఆయనకు మా నేతలు అపాయింట్మెంట్ ఇవ్వలేదని గుర్తు చేశారు. పార్టీని మోసం చేసి పోయిన వాళ్లు సంచులు తీసుకొని ఇక్కడ అక్కడ పోయినవాళ్లుకు చోటు లేదు.. ఎవరైతే మోసం చేసి పోయి అందర్నీ ఓడించాలని పోయినోళ్లు మళ్లీ తిరిగి వస్తామంటే మా ఐదుగురు ఎమ్మెల్యేలం ఒప్పుకొనే పరిస్థితి లేదు. మీడియా కూడా కావాలని ఎవరో వస్తున్నారని పదే పదే వార్తలు రాయొద్దని సూచించారు