నాగర్‌కర్నూల్, నవంబర్ 14 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో చలి పంజా విసురుతోంది. మూడు, నాలుగు రోజులుగా పలు మండలాల్లో తీవ్రత పెరుగుతూ వచ్చింది. పలు మండలాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు మండలాల్లోని ప్రజలు చలికి వణికిపోతున్నారు. చలికాలం ప్రారంభమయ్యే నవంబర్ మొదటి వారంలోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం వణికిపోతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని చాలా మండలాల్లో 13 నుంచి 15 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. మ ధ్యాహ్నం వేళల్లో కాస్త ఎండతాకినప్పటికీ ఉదయం, సాయంత్రం వేళల్లో మరీ పెరిగిపోయింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ 27 నుంచి 30 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే మరో నాలుగు రోజుపాటు తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖాధికారులు ప్రకటించడంతో జనం జంకుతున్నారు. చలికాలం ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే.. రాబోయే రోజుల్లో వణికిపోవాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో చాలా మండలాల్లో చలి తీవ్రంగా సింగిల్ డిజిట్‌గా ఉంటోంది.
నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 నుంచి 13 డిగ్రీలకు పడిపోయాయి. బుధవారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే పూర్తిగా రోజురోజుకూ తగ్గా యి. వెల్దండ మండలం 13.8 డిగ్రీలు, ఊర్కొండలో 14.1డిగ్రీలు, అమ్రాబాద్‌లో 14.2 డిగ్రీలు, బిజినేపల్లిలో 14.4డిగ్రీలు, కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్, తోటపల్లి, పదర మండలంలో 14.6డిగ్రీలు, తెలకపల్లిలో 14.7డిగ్రీలు, కల్వకుర్తి పట్టణంలో 14.9 డిగ్రీలు, తాడూరు మండలం యంగంపల్లిలో 15.1 డిగ్రీలు, ఉప్పునుంతల మండలం వెల్టూరు, నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర, చారకొండ మండలం సిరసనగండ్లలో 15.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగతలు నమోదయ్యాయి. అదేవిధంగా కొండారెడ్డిపల్లి, కొండనాగుల, అచ్చంపేట, వంకేశ్వరం, కిష్టంపల్లి, లింగాల, ఉప్పునుంతల, పాలెం, మంగనూరు గ్రామాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీలకు పడిపోయింది. మిగతా మండలాల్లో 16 నుంచి 18.8 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు వెల్లడిస్తున్నారు.