కల్వకుర్తి, మే 31 : చుక్క.. ముక్క..కిక్కు.. పల్లెల్లో నేడు ట్రెండ్‌గా మారిపోయింది. వేకువజాము మొదలు.. అర్ధరాత్రి వరకు.. చీప్ లిక్కర్ నుంచి కాస్లీ మందు వరకు.. ఏ బ్రాండ్ కావాలన్నా.. కేరాఫ్ బెల్ట్‌షాపులుగా పరిస్థితి తయారైంది. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే బెల్ట్‌షాపుల ఊసే లేకుండా చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నేతలు నేడు అధికారంలోకి వచ్చాక మద్యం ధరలు పెంచడంతోపాటు విచ్చలవిడిగా పేద, సామాన్య మందుబాబుల ‘బెల్ట్’ తీస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. ప్రతి గ్రామంలో గల్లీకొక దుకాణం ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం, అధికారుల నిఘా లేకపోవడంతో బెల్ట్ దుకాణాల దందా జోరుగా సాగుతున్నది.
కల్వకుర్తి ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చిన్న, పెద్ద గ్రామాలు కలుపుకొని దాదాపు 150 వరకు బెల్ట్ దుకాణాలు ఉన్నాయి. కల్వకుర్తి వంటి మున్సిపాలిటీలో సైతం బెల్టు దుకాణాలు ఉన్నాయంటే ఏ రేంజ్లో బెల్ట్ దుకాణాల హవా నడుస్తున్నదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. బెల్ట్ దుకాణాల వల్ల గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. చాలా వరకు కిరాణ దుకాణాల్లోనే బెల్ట్‌షాపులు నిర్వహిస్తుండడంతో ఎల్లప్పుడూ మద్యం అందుబాటులో ఉంటున్నది. బెల్టుషాపుల్లో సిట్టింగ్ సౌకర్యం, చికెన్, మటన్, తినుబండారాలు అందుబాటులో ఉంటున్నాయి.
గ్రామాల్లో ప్రతి పనికి మద్యం ఇవ్వాల్సిందే. ఇదే క్రమంలో వరినాటు వేసేటప్పుడు కూలీలకు కూలితోపాటు మద్యానికి డబ్బులు ఇవ్వాల్సిందే. నాటు వేసిన కూలీలకు ఎకరాకు ఒక ఫుల్ బాటిల్ ఇ వ్వాలి. కలుపు దేవేటప్పుడు కూడా అదే పద్ధ తి. ఇలా ప్రతి పనికి డబ్బులతోపాటు మద్యం అలవాటుగా మారుతోంది. దీంతో బెల్టుషాపులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి.
గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు అందుబాటులో ఉండటంతో తెల్లవారంగానే మందుబాబుల బెల్ట్ దుకాణాల వద్ద తచ్చాడుతున్నారు. సా యంత్రం కూలీ డబ్బులు చేతికి రాగానే నేరు గా బెల్ట్ దుకాణాలకు వెళ్తున్నారు. మద్యంతోపాటు గుడుంబా కూడా బెల్ట్ దుకాణాల్లో అందుబాటులో ఉంటున్నది. దీంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం వైన్స్ నుంచి మాత్రమే మద్యాన్ని కొనుగోలు చేయాలి. ఎక్కువ మొ త్తంలో మద్యాన్ని ఇండ్లల్లో నిల్వ ఉంచుకోకూడదు. నిబంధనలకు విరుద్దంగా నిల్వ ఉంచితే మద్యాన్ని సీజ్ చేసి కేసులు నమోదు చేస్తారు.
ఇంతటి కఠినమైన నిబంధనలు ఉన్నా బహిరంగంగా బెల్ట్‌షాపులు ఏర్పాటు చేసుకొని మ ద్యం అమ్ముతున్నారంటే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. కల్వకుర్తి, వెల్దండ, చారకొండ, వంగూర్ మండలాల్లోని పలు గ్రామాల వ్యవసాయ పొలాల్లో గు డుంబా తయారు చేస్తారన్నది బహిరంగ రహస్యమే. మద్యం క్రయవిక్రయాలపై నిబంధనలు అమలు చేయాల్సిన ఎక్సైజ్‌శాఖ చూసీ చూడనట్లు ఉండటం వెనుక కారణం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెద్దఎత్తున మద్యం దుకాణాల ద్వారా మామూళ్ల దందా జరుగుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మామూళ్ల కారణంగానే బెల్ట్ దు కాణాల దందా సవ్యంగా సాగుతుందని యువజన సంఘాల నేత లు అంటున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వెలిసిన మద్యం బెల్ట్ దుకాణాలను అరికడతాం. ఇప్పటికే ఈ షాపులపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాం. విచ్చలవిడిగా వెలుస్తున్నాయని ఎవరు ఫిర్యాదు చేసినా దుకాణాదారులపై చర్యలు తీసుకుంటున్నాం. కేసులు సైతం నమోదు చేస్తున్నాం. మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందినా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. గ్రామీణ ప్రాంత ప్రజలు మద్యం బెల్ట్ దుకాణాల నుంచి ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడినా నేరుగా జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చు.
– గాయత్రి, ఎక్సైజ్ సూపరింటెండెంట్, నాగర్‌కర్నూల్