కొల్లాపూర్ : జర్నలిస్టులను జర్నలిస్టులుగా చూడాలి గానీ పార్టీ కార్యకర్తలుగా చూడడం మంత్రి జూపల్లి కృష్ణారావు స్థాయికి తగదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హితవు పలికారు. శుక్రవారం కోడేరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొల్లాపూర్ నియోజక వర్గంలో ఇళ్ల స్థలాలు కావాలని దీక్షలు చేస్తున్న జర్నలిస్టుల సమస్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించకుండా దీక్ష చేస్తున్న వారిని పార్టీ కార్యకర్తలుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించడం ఆయన హోదాకు, వయసుకు తగదన్నారు. 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో అత్యధిక సార్లు మంత్రి పదవులు అనుభవించి కూడా జర్నలిస్టులకు శిలాఫలకాలతోనే సరిపెట్టాడని విమర్శించారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనాతో సమయం వృధా అయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా అనేక దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపడం జరిగిందన్నారు. పట్టణంలో సర్వే నెంబర్ 72లో ఎకరా 20 గుంటల భూమిలో జర్నలిస్టులందరికీ రాజకీయాలకతీతంగా మంత్రి జూపల్లిని అభిమానించే వారికి కూడా పార్టీలుగా ముద్ర వేయకుండా సీనియార్టీ ప్రకారం ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ ప్రొసీడింగ్‌ను తీసుకుని రావడం జరిగింది అన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా జర్నలిస్టులకు ఇలా స్థలాల పంపిణీ ఆగిపోయిందన్నారు. తను జర్నలిస్టులను జర్నలిస్టులుగా మాత్రమే చూశానన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా ఒక ప్లాట్ విలువ 20 లక్షల వరకు విలువ చేసే స్థలంలో ఇంటి స్థలాలు ఇచ్చేందుకు కృషి చేసినట్లు తెలిపారు. తను తెచ్చిన ప్రోసిడింగ్ ద్వారా ఇళ్ల స్థలాలు ఇస్తే తనకు పేరు వస్తుందని భావిస్తే ప్రొసీడింగు నూతనంగా తెచ్చి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మీరే పేరు తెచ్చుకోవాలని ఆయన మంత్రి జూపల్లి కృష్ణారావుకు సూచించారు. మీకు చేతనైతే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి కానీ జర్నలిస్టులను బిఆర్ఎస్ కార్యకర్తలుగా ముద్ర వేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా కొల్లాపూర్ నియోజక వర్గంలో మీ అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘువరన్ రెడ్డి తదితరులు ఉన్నారు.