మహబూబ్‌నగర్ అర్బన్, ఫిబ్రవరి 7 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది..మహబూబ్‌నగర్‌లో నిలిచిపోయిన అభివృద్ధిపనులతోపాటు కాలనీ సమస్యలు తీరుస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రజలకు హామీ ఇచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా శనివారం జిల్లాకేంద్రంలోని శ్రీనివాస కాలనీ, పద్మావతి కాలనీ, మెట్టుగడ్డ, వెంకటేశ్వర కాలనీ, పాతతోట, కుమ్మరివాడి, వీరన్నపేటలో శనివారం ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి పని చేస్తున్నాయని , ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఆ పార్టీలను సాగనంపాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో పేదలు, అంధులకు ఇండ్లు కట్టి ఇస్తే కాంగ్రెస్ నాయకులు వాటిని కూలగొట్టి సంబురాలు చేసుకున్నారంటూ మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో అమర రాజా, ఐటీ వంటి పెద్ద కంపెనీలు తరలివచ్చాయని దీంతో పట్టణం ఇమేజ్ పెరిగిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి చూపించాలని.. మేము చేసిన అభివృద్ధి అడుగడుగునా కనిపిస్తుందన్నారు. పట్టణంలో ఓ జిల్లా దవాఖాన ఉండగా..పేదలకు అత్యవసరం సేవలకోసం మరో వెయ్యి పడకల దవాఖాన తీసుకొచ్చామని గుర్తుచేశారు. రైతులకు సాగునీరు అందించేందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 90శాతం పూర్తి చేశాం.. మిగిలిన 10శాతం పూర్తి చేస్తే నీళ్లు పొలాలకు వస్తాయి..కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయకుండా నిలిపివేసిందని విమర్శించారు. మహబూబ్‌నగర్ పట్టణంలో రోడ్ల వెడల్పు, ప్రతి రోజూ తాగు నీరు సరఫరా, మురుగు కాల్వల నిర్మాణం వంటి కనీస వసతులు పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య పాల్గొన్నారు.