మహబూబ్‌నగర్‌టౌన్, డిసెంబర్ 26: స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలస్ఫూర్తితో ప్రతిఒక్కరూ దేశ ప్రగతికి పాటుపడాలని ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ అ న్నారు. జిల్లాకేంద్రంలోని విజన్గార్డెన్ ఫంక్షన్హాల్లో సోమవారం సమరయోధులు, రాంప్రసాద్బిస్మిల్, అష్పాఖ్ఉల్లాఖాన్ అమరత్వం యాది పేరిట దేశప్రగతికి అంకిమవుదాం అనే అంశంపై ప్రజాసంఘాలు, మేధావులతో సభ నిర్వహించారు. సభకు ముఖ్యఅతిథిగా సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ హాజరై మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం రాంప్రసాద్బిస్మిల్, అష్ఫాఖ్ఉల్లాఖాన్ త్యాగాన్ని మరువొద్దన్నారు.
చరిత్రను చరిత్రగా తెలుసుకోవాలని, వర్గీకరించడం సరికాదన్నారు. సమస్యలను పక్కతోవ పట్టించడానికి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ నిర్మాణానికి ఐక్యంగా పోరాటం చేయాలని కోరారు. దేశంలో కార్పొరేట్ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. దేశ బడ్జెట్ కంటే ఎక్కువ 100మల్టినేషన్ కంపెనీల ఆదాయం ఎక్కువ ఉందన్నారు. దేశంలో చావులు, పేదరికం, నిరుద్యోగ సమస్యలు వేధిస్తుంటే, మత రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో టీఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్ఎం ఖలీల్, పాలమూరు అధ్యాయన వేదిక రాఘవాచారి, ఎంఆర్జేఎసీ రాష్ట్ర కన్వీనర్ హనీఫ్‌అహ్మద్, ఉపాధ్యాయ నాయకుడు నర్సింహారెడ్డి, ప్రజాసంఘాల నాయకులు బుచ్చారెడ్డి, వామన్‌కుమార్, సమాద్ఖాన్, కురుమూర్తి, అదిత్య, శ్రీదేవి, లక్ష్మణ్‌గౌడ్, విజయ్‌కుమార్, మసూద్‌అలీ, ముంతాజ్, నూరుల్‌హసన్, రహీం, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.