పచ్చని పల్లెల్లో ‘ఇథనాల్’ మంటలు రాజుకున్నాయి. ఫ్యాక్టరీ పేరు వింటేనే రైతులు ఉలిక్కిపడుతుండగా.. గ్రామాలు వణుకుతున్నాయి. పెద్ద ధన్వాడ వద్ద ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వొద్దంటూ స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో 10 వేల ఎకరాలపై తీవ్ర ప్రభావం పడుతుండడంతో చిచ్చు రేగింది.
12 గ్రామాల వాసులు తిరుగుబావుటా ఎగురవేశారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కంపెనీకి ఎలా అనుమతులు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు, ప్రజలు దీక్షలు చేపట్టారు. దీంతో రాజోళి మండలంలో ఒక్కసారిగా హైటెన్షన్ మొదలైంది. ఆలస్యంగా మేల్కొన్న రైతులు ఈ ఫ్యాక్టరీ మాకొద్దు.. అంటూ తిరుగుబావుటా ఎగురవేశారు. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన వ్యక్తికి ఇక్కడి నాయకులు వత్తాసు పలకడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఫ్యాక్టరీ ఏర్పాటైతే ఇక్కడి సహజ వనరులన్నీ విషపూరితం అవుతాయని అంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం చెందుతున్నారు.
– గద్వాల, జనవరి 31
తుంగభద్ర నది తీరాన.. ప్రశాంత వాతావరణంలో 12 గ్రామాల ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే అక్కడి స్థానికులకు పిడుగు లాంటి వార్త తెలియడంతో భయాందోళనకు గురవుతున్నారు. రాజోళి మండలంలో ఇథనాల్ కం పెనీ ఏర్పాటు విషయం తెలుసుకొని ఆందోళనకు దగారు. పచ్చని పొలాలు, పల్లెలు, నది, గాలిని కలుషితం చేసే ఫ్యాక్టరీ మాకు వద్దంటూ ఆందోళన చేపట్టారు. ఇప్పటికే నారాయణపేట జిల్లా చిత్తనూర్‌లో ఇలాంటి కంపెనీని రాకుండా అక్కడి రైతులు, ప్రజ లు అడ్డుకున్నారు.
గ్రామ పంచాయతీ తీర్మానం లే దు.. ప్రజల అభిప్రాయాలు సేకరించకుండా కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండడంపై స్థానికులు మండిపడుతున్నారు. అందుకు సంబంధించిన రో డ్డు, విద్యుత్ పనులు చేస్తుండడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వ్యతిరేకంగా 12 గ్రామాల ప్రజలు ఆందోళనలకు దిగారు. కలెక్టర్‌కు, ప్రజాప్రతినిధులకు సైతం వినతిపత్రాలు అందజేశారు. ఆందోళనలతో పనులు నిలిపిన యాజమాన్యం.. మళ్లా ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నది.
దీంతో వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కాసులకు కక్కుర్తిపడిన అధికారులు పంట పొలాలు ఏమైతేనేమి.. రైతులు రోడ్డున పడ్డా మాకేంటి.. అన్నట్లు ఫ్యాక్టరీకి సంబంధించి నీటి కేటాయింపులు ఇరిగేషన్ అధికారులు చేశారు. ఫ్యాక్టరీ ఎప్పటికీ ఒక టీఎంసీ నీరు నిల్వ ఉండేలా అధికారులు ఇచ్చారు. అయితే ఫ్యాక్టరీ నుంచి వెలువడే రసాయనాలు రివర్స్ పంపి ంగ్ ద్వారా నదిలోకి వదిలేలా ప్రణాళిక సిద్ధం చేశా రు.
ఆ నీరు తుంగభద్రలోకి వదిలితే నదినీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నదని రైతులు వాపోతున్నారు. విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. ఈ విషయం తెలిసిన రైతులు ఫ్యాక్టరీ వస్తే బంగారు పంటలు పండే భూ ములు బీడు భూములుగా మారడం ఖాయమన్నారు. కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నా అధికార పార్టీ నాయకులు మాత్రం ఇక్క మాట మాట్లాడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
రాజోళి మండలం పెద్ద ధన్వాడ వద్ద గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి. తుంగభద్ర నది నుంచి రెండు మోటర్ల ద్వారా నీటిని నిరంతరం ఇథనాల్ ఉత్పత్తికి వినియోగించుకునేలా అనుమతులు ఇచ్చారు. నిత్యం సుమారు 1.20 లక్షల లీటర్ల ఇంధ నం ఉత్పత్తి చేసేలా రూ.189 కోట్లతో 29 ఎకరాల్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. అయితే పనులు ప్రారంభించేందుకు యత్నించగా.. స్థానికులు అడ్డుకున్నారు. అక్కడికి రెవెన్యూ అధికారులు, పోలీసులు వెళ్లి స్థానికులతో చర్చించిన తర్వాతే పనులు చేపడుతారని చెప్పారు. అయితే కంపెనీ యాజమాన్యం తిరి గి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తుండగా.. మరోసారి అడ్డుకున్నారు. ఈ ఫ్యాక్టరీ మాకొద్దంటూ కలెక్టరేట్ వద్ద ఆందోళనలు చేపట్టారు. అయినా కంపెనీ యాజమాన్యం మొండిగా పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తుండడంతో ఊరూరా ఉద్యమాలు మొదలయ్యాయి.
ఇథనాలు ఫ్యాక్టరీ ఏర్పాటైతే పెద్ద ధన్వాడ, చిన్నధన్వాడ, చిన్నతాండ్రపాడ్, నౌరోజీ క్యాంపు, కేశవరం, వేణిసోంపురం, తుమ్మిళ్ల, మాన్‌దొడ్డి, నసనూర్, పచ్చర్ల, తనగల, పెద్దతాండ్రపాడ్, రాజోళి గ్రామాల పరిధిలో సుమారు 10వేల ఎకరాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నది. కంపెనీ నుంచి వెలువడే రసాయ నాలతో బీడు భూములు పెరగనున్నాయి. దీని ను ంచి వచ్చే వ్యర్థాలు వాగు, సమీపంలోని తుంగభద్ర నదిలో కలవడంతో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉన్నది. అందుకే స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం పెద్దధన్వాడ గ్రామంలోని పేద దళితులకు 152 ఎకరాలు ప్రభుత్వ భూమిని కేటాయించింది. ఈ భూముల్లో పొగాకు, మిరప, వేరుశనగ, కంది పంటలు సాగు చేసుకొని జీవిస్తున్నారు. ఈ పొలాల పక్కనే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుండడంతో భూములు సాగు చేసుకునే జీవించే దళితులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నది. దీనికితోడు 2009లో తుంగభద్ర నదికి వరదలు వచ్చిన సమయంలో ప్రభుత్వం ప్రస్తుతం ఫ్యాక్టరీ నిర్మాణం చేసే పొలం పక్కనే దళితులకు ఆరెకరాల భూమిని ఇండ్ల నిర్మాణానికి నాటి సర్కారు కేటాయించింది. ప్రస్తు తం అక్కడే ఫ్యాక్టరీ ఏర్పాటు కానుండడంతో భవిష్యత్‌లో తాము అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
రైతులకు నష్టం కలిగించే ఎలాంటి ఫ్యాక్టరీనైనా అడ్డుకుంటామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి భరోసా ఇచ్చారు. ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రిలే దీక్షలు చేస్తున్న రైతు శిబిరానికి మద్దతు తెలిపారు. పొలాలను నాశనం చేసే పరిశ్రమ అనుమతులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతేడాది నవంబర్ 8న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు.
పచ్చని పల్లెలపై విషం చిమ్మే ఈ పరిశ్రమ మాకొద్దు. ఇప్పుడిప్పుడే రైతులు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే మా పచ్చని పొలాలు బీడులుగా మారే అవకాశం ఉన్నది. ఎట్టి పరిస్థితిలో ఫ్యాక్టరీ నిర్మాణం జరగనివ్వం. గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ప్రజలు, పొలాలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. మా పంటలు దెబ్బతింటాయి. భూముల్లో గడ్డి కలుషితమై మా పశువులు తింటే వాటి ప్రాణాలకే ముప్పు. మాకు నష్టం కలిగించే దేనినైనా అడ్డుకుంటాం. పచ్చని పంట పొలాలు పండే ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ అవసరం లేదు. ఎక్కడైనా ఏర్పాటు చేసుకోండి.
– పరమేశ్వర్‌గౌడ్
అనుమతులు రద్దు చేసే వరకు మా పోరా టం ఉంటుంది. ఫ్యాక్టరీ వ్యర్థాలతో పచ్చని పొలాలు బీళ్లుగా మారే అవకాశం ఉన్నది. అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే నారాయణపేట జిల్లా చిత్తనూర్, నిర్మల్ జిల్లా గుండంపల్లి, దిలావర్పూర్ రైతులు వ్యతిరేకించారు. ఫ్యాక్టరీ సమీపంలో మాకు 20 ఎకరాల భూమి ఉంది. కంపెనీ వస్తే బీడుగా పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఉన్న భూమి పోతే మేము ఎలా బతకాలి. ఆందోళనలు చేస్తే పోలీసులు భయపెడుతున్నారు. ఎవరికీ భయపడే ప్రసక్తి లేదు. ప్రాణాలైనా అడ్డు పెట్టి ఫ్యాక్టరీ నిర్మాణా న్ని అడ్డుకుంటాం.
ఫ్యాక్టరీ వస్తే సాగు, తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నది. పనులు జరిగే సమీపంలోనే కేసీఆర్ ప్రభుత్వం పేద దళితులకు 152 ఎకరాలు కేటాయించింది. ఫ్యాక్టరీ ఏర్పాటైతే కాలుష్యంతో పచ్చని పొలాలు బీళ్లుగా మారతాయి. మాకు అన్యాయం జరిగే ఈ ఫ్యాక్టరీ మాకు అవసరం లేదు. 2009లో వరదలు వచ్చిన సమయంలో దళితుల ఇండ్ల నిర్మాణం కోసం నాటి సర్కారు ఆరెకరాలు కేటాయించింది. ఇండ్లకు కేటాయించిన భూమి పక్కనే కంపెనీ నఏర్పాటు చేస్తున్నారు. మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తాం.
– హన్మంతురెడ్డి, రైతు