మక్త ల్/ ఊట్కూర్ : ఏరువాక పౌర్ణమి ( Eruvaka Pournami ) పురస్కరించుకొని మక్తల్, ఊట్కూర్ మండలాల్లో ఏరువాక పౌర్ణమి వేడుకలను అంగరంగ వైభవంగా కనుల పండువగా నిర్వహించారు. మృగశిర కార్తి ప్రారంభం సమయంలో వచ్చే ఏరువాక పౌర్ణమికి రైతన్నలు వ్యవసాయానికి కేంద్ర బిందువులుగా ఉపయోగపడే కాడెద్దులను (Bulls ) శుభ్రం చేసి, రంగులతో అలంకరించి పూజలు నిర్వహించారు.
మక్తల్ మున్సిపాలిటీలో వేణుగోపాల స్వామి దేవాలయం ( Venugopala Swamy Temple ) ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులను పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు. ఆలయం ప్రాంగణం ఎదుట రైతుల కొలహాల మధ్య ఏర్కతాడు తెంపే కార్యక్రమం రెండున్నర గంటల పాటు కొనసాగింది. పలు గ్రామాల్లో ఎద్దుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. పోటీలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.