ఊట్కూర్ : జాతీయ గ్రామీణ ఉపాధి కూలీలకు ( Employment workers ) రోజుకు రూ. 600 కూలీ చెల్లించాలని సీఐటీయూ (CITU ) జిల్లా అధ్యక్షుడు వెంకట్రామారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని ఓబులాపూర్ గ్రామాన్ని సందర్శించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26 న నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నాను ( Dharna ) విజయవంతం చేయాలని కోరారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ( Narendra Modi ) ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కార్డులను, రైతు వ్యతిరేక విధానాలను, కూలి వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు.
ఉపాధి కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించాలని, పని ప్రదేశంలో కూలీలకు వసతులు కల్పించాలని, పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మిక వర్గం ఐక్య ఉద్యమాలతో హక్కుల్ని కాపాడుకోవాలని, ప్రభుత్వ విధానాల్ని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు శంకర్, గోవిందు, మహేష్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.