కృష్ణ, జూన్ 22 : నారాయణపేట జిల్లా ముడుమాల్ సమీపంలోని కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో ఉన్న నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల గుర్తింపు సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ జాబితాలో చేర్చేందుకు అవసరమైన డాక్యుమెంటేషన్, పరిరక్షణకు సాంకేతిక సహకారంపై తెలంగాణ పురావస్తు శాఖ, దక్కన్ హెరిటేజ్ అకాడమీ మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరిందని దక్కన్ హెరిటేజ్ ట్రస్టు అధికారి వేదకుమార్ తెలిపారు.
ఈ మేరకు హైదరాబాద్‌లో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్యాంపు కార్యాలయంలో ఒప్పంద పత్రాలు ట్రస్టు కార్యదర్శి ప్రభాకర్, ఆచార్య కేపీరావుకు అందజేశారు. బుధవారం నిలువురాళ్లను దక్కన్ హెరిటేజ్ ట్రస్టు అధికారి వేదకుమార్, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పుల్లారావు సందర్శించారు. ఈ ప్రాంతం అరుదైందని, ఆసియా ఖండంలోనే మొదటిదన్నారు. ఇలాంటివి ఆఫ్రికా ప్రాంతంలోనే కనిపిస్తాయని ప్రొఫెసర్ పుల్లయ్య తెలిపారు.