ఊట్కూర్, మార్చి 10: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు గురుతర బాధ్యత నిర్వర్తించారు. ఉపాధ్యాయులుగా మారి తోటివారికి తమదైనశైలిలో పాఠాలు బోధించి ఆకట్టుకున్నారు. మండలంలోని పులిమామిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠాలను బోధించారు. హెచ్ఎంగా శ్రీలత, ఎంఈవోగా ఐశ్వర్య, కలెక్టర్‌గా వై. ఐశ్వర్య, డీఈవోగా భాగ్య వ్యవహరించారు. కార్యక్రమంలో హెచ్ఎం చంద్రశేఖర్, పీఈటీ రవీందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చిన్నపొర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని హెచ్ఎంగా శిరీష, కలెక్టర్‌గా అంజయ్య, ఎంఈవోగా స్పందన, డీఈవోగా మౌనిక, పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో హెచ్ఎం జగన్నాథరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద, మార్చి 10: మండలంలోని కంసాన్పల్లి పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి బోధన చేశారు. అనంతరం పాఠశాల వార్షికోత్సవ సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం హెచ్ఎం సుధాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటుకు ధీటుగా చదువులు ఉన్నాయన్నారు. చదువుతోపాటు ఆటాపాటలు, అన్ని రంగాల్లో శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ గోవిందమ్మ, ఎంపీటీసీ కిష్టప్ప, సర్పంచ్ గురునాథ్‌గౌడ్, గ్రామపెద్దలు, యువకులు పాల్గొన్నారు.
కృష్ణ, మార్చి 10: మండలంలోని గుడేబల్లూర్ 1వ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సీడీపీవోగా త్రివేణి, సూపర్వైజర్గా తన్సి, అంగన్వాడీ టీచర్‌గా స్మిత, అంగన్వాడీ సహాయకురాలిగా శిల్ప మిడిమిడి జ్ఞానంతో బోధన చేశారు. చిన్నారుల బోధనను చూసి తల్లులు సంబురపడ్డారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కమల, సహాయకురాలు భారతమ్మ, చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.
మరికల్(ధన్వాడ), మార్చి 10: ధన్వాడ మండల కేంద్రంలోని అక్షర పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు ఘనంగా స్వయం స్వపరిపాలన దినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటివిద్యార్థులకు పాఠాలను బోధించారు. విద్యార్థులకు ఉత్తమంగా పాఠాలు బోధించిన వారికి పాఠశాల యాజమాన్యం బహుమతులు ఆందజేశారు. కార్యక్రమంలో అక్షర పాఠశాల ఉపాధ్యాయులు, కరస్పాండెంట్ తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, మార్చి 10: మండలంలోని కర్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కాట్రేవ్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాల, మాద్వార్, గుడిగండ్ల పాఠశాలల్లో శుక్రవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆయా పాఠశాలల అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఉన్నారు.
కోస్గి, మార్చి 10: గుండుమాల్ మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు శుక్రవారం గురుతర బాధ్యత నిర్వర్తించి తోటివారికి పాఠాలు బోధించారు. అలాగే డీఈవోగా శివసాయి, ఎంఈవోగా నవీన్‌కుమార్, హెచ్ఎంగా నందిని వ్యవహరించారు. అనంతరం ఉత్తమంగా పాఠాలు బోధించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మీర్జాపూర్ జెడ్పీహెచ్ఎస్లో స్వయంపాలన దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం గీత, ఉపాధ్యాయులు రవీందర్‌నాయక్, ప్రకాశ్‌గౌడ్, నర్సింహులు, సీఆర్పీ దస్తయ్య తదితరులు పాల్గొన్నారు.