గండీడ్, ఆగస్టు 3 : మండల కేంద్రంలో ఎస్బీఐ ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు కొల్లగొట్టేందుకు విఫలయత్నం చేశా రు. పోలీసుల రాకతో పరారయ్యారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున సుమారు 3గంటల సమయంలో దుండగులు ఏటీఎంను గ్యాస్ కట్టర్తో పగులగొట్టేందుకు ప్రయత్నించారు. బ్యాంకు మేనేజర్ ఫోన్కు మెసేజ్ రావడంతో బ్యాంకు భవనాన్ని అద్దెకిచ్చిన ఓనర్కు ఫోన్ చేశాడు.
ఏటీఎం దగ్గర ఏదో జరుగుతుందని, వెళ్లి చూడాలని కోరడంతో, వారు ఏటీఎం దగ్గర శబ్దాలను గమనించి ఎవరో ఉన్నారని చెప్పారు. చోరీకి ప్రయత్నిస్తున్నారని నిర్ధారించుకున్న బ్యాంకు మేనేజర్ మహ్మదాబాద్ పోలీసులకు స మాచారం ఇవ్వగా పోలీసులు హుటాహుటిన బయలుదేరారు. అయితే పోలీసుల రాకను గుర్తించిన దుండగులు చోరీ ప్రయత్నాన్ని వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గాంధీనాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు.