కొత్తకోట, సెప్టెంబర్ 13 : మూడు, నాలుగేండ్ల నుంచి రెండు రాష్ర్టాలకు సంబంధించిన అమాయక ప్రజలను ఇండియా బుల్స్, ధని, ముద్ర లోన్ పేరు తో సైబర్ క్రైం ద్వారా దోచుకుంటున్న కరుడు గట్టిన నేరస్తుల్లో ఒకరైన ముడావత్ కిషన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా జడ్జి రిమాండ్ చేసినట్లు డీఎ స్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నిందితుడికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
సైబర్ క్రైం కేసులో ఆగస్టు 29న ప్రధాన సూత్రదారి అయిన నర్సింగ్‌నాయక్, కురుమూర్తి, రాత్లావత్ రమేశ్, ఇస్లావత్ రాములు, కొత్తపల్లి ఉమేశ్ వీరితోపాటు ఇద్దరు మైనర్లను పెద్దమందడి మండలంలో అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు చెప్పారు. సెప్టెంబర్ 12న పామిరెడ్డిపల్లితండాకు చెందిన ముడావత్ రమేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసు పరిశోధనలో భాగంగా విచారించగా మరో నేరస్తుడు ముడావత్ కిషన్ పెద్దమందడి మండలం ముందరితండాలో పట్టుకొని విచారించగా కతార్, సౌదీఅరేబియాలో దేశాల్లో 2012 వరకు మేస్త్రీగా పనిచేశారు.
తరువాత 2013 సంవత్సరంలో ఇండియాకు వచ్చి మామిడి మాడకు చెందిన సునీతను వివాహం చేసుకున్నాడు. పెండ్లి తరువాత గల్ఫ్ దేశాలకు వెళ్లి 2020 వరకు అక్కడే ఉన్నాడు. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత హైదరాబాద్‌లో ఆటో నడిపేవాడు. తన చిన్న తమ్ముడైన రాకేశ్ ద్వారా వడావత్ రమేశ్, చెట్కి రమేశ్ సైబర్ నేరాలు చేస్తున్నారని తెలుసుకున్నాడు. వారికోసం బిహార్ రాష్ట్రంలోని పాట్నాకు వెళ్లి వడావత్ రమేశ్, చెట్కి రమేశ్, హరీశ్, నరేశ్ సహకారంతో సైబర్ నేరాల్లో పాలుపంచుకొని డబ్బులు సంపాదించాడు.
ఇక్కడికి వచ్చిన అనంతరం కూడా ముద్ర, ఇండియా బుల్స్, ధని అనే లో న్స్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడి అమాయక ప్రజలను మోసం చేసి దాదాపు రూ.కోటి రూపాయలతో వనపర్తిలో రెండు ప్లాట్లు కొనుగోలు చేశాడన్నారు. అదేవిధంగా తన తండాలో రూ.65లక్షలతో ఆధునిక వసతులతో రెండు ఇండ్లు కట్టడంతోపాటు రెండు కార్లు కూడా కొన్నట్లు చెప్పారు. అరెస్టు చేసిన సమయంలో వీటితోపాటు వివిధ బ్యాంకులకు చెందిన అకౌంట్లు, మూడు మొబెల్స్, రెండు కీ ప్యాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిందితుడిని శుక్రవారం ఆత్మకూర్ కోర్టులో హాజరుపర్చగా జడ్జి రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. ఈ కేసు విచారణ తెలంగాణ సైబర్ సెక్రటరీ బ్యూరో షికా గోయల్, డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వనపర్తి డీఎస్పీ పర్యవేక్షణలో కొత్తకోట ఎస్సై మంజునాథ్‌రెడ్డి, శ్రీరంగాపురం ఎస్సై వెంకటేశ్వర్లు సహకారం తో దర్యాప్తు చేసినట్లు వివరించారు. సమావేశంలో సెక్యూరిటీ ఇన్చార్జి డీఎస్పీ రత్నం, రాంబా బు తదితరులు పాల్గొన్నారు.