నాగర్‌కర్నూల్, అక్టోబర్ 9 : జిల్లాలో డీఎస్సీకి సంబంధించిన స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలిచ్చి తమకు అన్యాయం చేశారని ఆరుగురు అభ్యర్థులు బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటలకు ఎంపికైన అభ్యర్థులు నియామకపత్రాల కోసం హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో వాహనాల వద్దకు వచ్చినా.. తమకు అన్యాయం జరిగిందంటూ నాగర్‌కర్నూల్ మం డలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన అశోక్‌కుమార్, అమ్రాబాద్‌కు చెందిన అరవింద్ ఆరోపించారు.
ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ 1:3 జాబితాలో తాము సెలక్ట్ అయ్యామని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తి అయిందన్నారు. అయితే, తమ స్థానంలో ఇప్పుడు ఎంపికైన వారు 1:3 జాబితాలో లేరని, రిజిస్ట్రేషన్ చేసుకోలేదని, స్పోర్ట్స్ కోటాలో కూడా లేరన్నారు. తమకంటే తక్కువ మార్కులు, ర్యాంక్ వచ్చిన వారిని చివరి జాబితాలో చేర్చి ఉద్యోగాలకు ఎంపిక చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో విచారణ జరిపి న్యాయం చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు అశోక్‌కుమార్, అరవింద్‌తోపాటు వెయ్యిలోపు ర్యాంకు వచ్చిన లలిత, సుమలత, ప్రతిభ, నిర్మల తెలిపారు.