మహబూబ్‌నగర్ కలెక్టరేట్, అక్టోబర్ 26 : ఉమ్మడి పాలమూరులో మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. కిక్కు ‘లక్కు’ తమను వరిస్తుందా..? లేదా..? అంటూ గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. ఈసారి లక్ష్మీ కటాక్షం ఎవరిని వరించబోతుందోనన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఈ నెల 27న సోమవారం నిర్వహించనున్న లక్కీ డ్రా ప్రక్రియలో లక్కు ఎవరిదో తేలనుంది. ఇందుకోసం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్ సముదాయ భవనాల్లోని సమావేశ మందిరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కొత్తగా టెండర్ వేసిన వారు మొదటి అవకాశంపై ఆశలు పెట్టుకుంటున్నారు. మద్యం దుకాణాలు ఎవరిని వరించనున్నాయోననే అంశంపై వ్యాపార వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. వ్యాపారులు సిండికేట్‌గా మారి దరఖాస్తు చేసుకున్నా ఏ గ్రూపునకు లబ్ధి జరుగుతుందోననే విషయంపై చర్చించుకుంటున్నారు. గతంలో గ్రూపుగా ఏర్పడి కోటి రూపాయ ల వరకు నష్టపోయిన వారు కూడా ఉన్నారు. ఈసారి ఎవరికి లక్కు తగులుతుందోననే దానిపై ఆసక్తి నెలకొన్నది. డ్రాను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎక్సైజ్‌శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
గత సీజన్లో భారీ పోటీ, అధిక దరఖాస్తులతో టెండర్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 230 మద్యం దుకాణాలకు 8,632 దరఖాస్తులతో (రూ.2లక్షల నాన్ రీఫండబుల్ ఫండ్) ద్వారా సుమారు రూ.172 కోట్లు మేర ఆదాయం సమకూరింది. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉన్నది. దరఖాస్తు ఫీజు రూ.3లక్షలకు పెంచడంతో టెండర్‌దారులు నిరాశకు గురయ్యారు. దీంతో ఉమ్మడి పాలమూరులో 227 మద్యం దుకాణాలకు 5,536 టెండర్లు దాఖలయ్యాయి. ప్రభుత్వానికి రూ.166.08 కోట్లు ఆదాయం మాత్రమే సమకూరింది. మ హబూబ్‌నగర్ జిల్లాలో 54 మద్యం దుకాణాలకు 1634, నాగర్‌కర్నూల్ జిల్లాలో 67మద్యం దుకాణాలకు 1,518 టెండర్లు, నారాయణపేటలో 36 దుకాణాలకు 853, వనపర్తిలో 36కు 757, గద్వాలలో 34కు 774 దాఖలయ్యాయి.
సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం మద్యం దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలలోపు టెండర్‌దారులు వేదిక వద్దకు అసలు రశీదు, ఎంట్రీపాస్తో చేరుకోవాల్సి ఉంటుంది. మొబైల్ఫోన్లను హాల్లోకి అనుమతించరు. లాటరీ ద్వారా ఎంపిక చేయబడిన దరఖాస్తుకు సంబంధించి అదేరోజు, మరుసటి రోజు షాప్ ఎక్సైజ్ పన్ను మొదటి వాయిదాను చెల్లించాలి. డీపీఈవో నుంచి షాప్ కేటాయింపు నిర్ధారణ లేఖ తీసుకోవాలి.