కొత్తకోట, మార్చి 30: మండలంలోని సంకిరెడ్డిపల్లి తండా శివారులో కొటేటేన్ గుట్టపైన ఆయిల్ పాం ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకూడదని చుట్టుపక్కల గ్రామస్తులు ఆదివారం ధర్నాకు పూనుకున్నారు. ఈ కొటేటేన్ గుట్ట పంచాయతీలో ఉందని.. ఇక్కడ ఆయిల్ పాం ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకూడదని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా ఉద్రిక్తమవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడుతూ.. గుట్ట మీద ఫ్యాక్టరీ నిర్మిస్తే సంకిరెడ్డిపల్లి చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామాలైన సంకిరెడ్డిపల్లి కొత్తఊరు, సంకిరెడ్డిపల్లితండా, కానాయపల్లి కొత్తఊరు, కొత్తకోట మండల కేంద్రానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఈ గుట్ట నాలుగు గ్రామాల్లో ఉండే గొర్లు, పశువుల కాపర్లకు నివాసంగా ఉందని, గొర్లు, పశువులను మేపడానికి తీసుకొస్తామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి గుట్టను ఇప్పుడు ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని ఆయిల్ పాం మిల్లును ప్రారంభించడానికి సిద్ధమవుతోందని ధర్నాకు దిగినట్లు పేర్కొన్నారు. అయితే ఈ నాలుగు గ్రామాల ప్రజలు ఆయిల్ పాం మిల్లుతో ఉపయోగం ఏం లేదని, ఈ మిల్లుతో చాలా వరకు నష్టాలే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు.
ధర్నాలో పాల్గొన్న వారంతా కాంగ్రెస్ కార్యకర్తలే కావడం విశేషం. ఫ్యాక్టరీని నిర్మించడానికి వీల్లేదని ధర్నాకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే జీఎమ్మార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు మా చెప్పు తీసుకొని మేమే కొట్టుకునే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. మేము ఓట్లు వేసి గెలిపించుకున్న నాయకులే ఇలా చేస్తే ప్రజల పరిస్థితి ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దౌర్జన్యాలు ఆపాలని ఎమ్మెల్యే జీఎమ్మార్‌కు విజ్ఞప్తి చేశారు.