మక్తల్ : మక్తల్ మున్సిపాలిటీలో వీధి కుక్కల స్వైర విహారంతో ( Dog Attacks ) ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. మిగతా మూగ జీవాలపై దాడి చేసి చంపి భయాందోళనలు సృష్టిస్తున్నాయి. మక్తల్ ( Maktal ) పట్టణంలో వీధి కుక్కలు భారీ సంఖ్యలో సంచరిస్తుండడంతో పాటు, మనుషులపై దాడి చేస్తూ హడలెత్తిస్తున్నాయి. గురువారం రాత్రి మక్తల్ మున్సిపాలిటీలోని రాఘవేంద్ర థియేటర్ యాదవనగర్ ( Yadavnagar ) మౌలాలి మసీద్ సమీపంలో మేక ( Goat ) పై కుక్కలు దాడి చేసి చంపి తిన్నాయి.
మేకపై దాడి చేస్తున్న కుక్కలను నియంత్రించడానికి పట్టణవాసి ఒకరు ప్రయత్నించగా అతడిపై తిరగబడటంతో భయంతో అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మక్తల్ మున్సిపల్లోని ప్రధాన రహదారి పై ఉన్న మటన్ మార్కెట్ వ్యాపారులు మటన్ వ్యర్థాలను సమీప షాపు వెనకాలనే పడేయడం వల్ల పదుల సంఖ్యలో కుక్కలు ప్రధాన రహదారిపై సంచరిస్తూ ఉంటాయి.
రాత్రి సమయంలో ప్రధాన రహదారిపై వెళ్లాలంటేనే కుక్కల దాడి నుంచి భయాందోళనకు గురవుతున్నారు. కుక్కలను నియంత్రించడంలో మున్సిపల్ సిబ్బందితోపాటు, మున్సిపల్ అధికారులు విఫలం చెందడంపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి, పట్టణంలో కుక్కల లను తరలించేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో శబరి కాలనీలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.