వనపర్తి : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్( Bandi Bhagirath ) అఘాయిత్యాలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వనపర్తిలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్న పార్టీ నాయకులు చట్ట వ్యతిరేక పనులు చేయవచ్చా అంటూ నిలదీశారు.
బండి భగీరథ్‌పై ఫోక్సో కేసు నమోదైనప్పటికీ అరెస్టు చేయకుండా అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు చట్టానికి,రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవస్థను బలహీనంగా చేయడం వల్ల సమాజం బలహీన పడుతుందని పేర్కొన్నారు. మైనర్ బాలిక కుటుంబానికి ఒక సెక్షన్ మీడియా వంతపలకడం శోచనీయం అన్నారు.
అద్భుతమైన కాళేశ్వరం కట్టిన కేసీఆర్‌పై దుష్ప్రచారం చేయడం, ఇచ్చిన హామీలు అమలు చేయనివారికి అండగా నిలువడం దారుణమని అన్నారు. నైతిక విలువలు కాపాడాల్సిన బాధ్యత అన్ని సంస్థలపై ఉందని నిరంజన్ రెడ్డి అన్నారు.