కల్వకుర్తి రూరల్ : గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో (Revenue conferences) వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ నమోదులో ( Online ) తప్పిదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నాగర్‌కర్నూలు జిల్లా కలెక్టర్ బి సంతోష్ కుమార్ (Collector Santosh Kumar) అధికారులకు సూచించారు. గురువారం కల్వకుర్తి మండలం పంజుగుల గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసేందుకు వచ్చిన ఆర్జీదారులతో కలెక్టర్ మాట్లాడారు.
రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఆర్జీదారుడికి తప్పనిసరిగా రసీదుని అందజేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న వారి యొక్క సమస్యలు అక్కడే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటే తహసిల్దార్ వెంటనే చొరవ తీసుకుని పరిశీలించాల్సిందిగా ఆదేశించారు.
సమస్య పరిష్కారం కాని దిశలో ఎందుకు పరిష్కరించలేకపోతున్నామనే విషయాన్ని దరఖాస్తుడికి వివరించాలని అన్నారు. దరఖాస్తుదారుడు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాటికి ఒక పరిష్కార మార్గాన్ని సూచించే విధంగా అధికారులు చొరవ చూపాలని అన్నారు. ఆయన వెంట ఆర్డీవో శీను, రెవెన్యూ అధికారులు, తదితరులు ఉన్నారు.