వనపర్తి, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న దృష్ట్యా అధికార యంత్రాంగం ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువతీ, యువకులతోపాటు చిరునామా, ఫొటోలాంటి మార్పులు చేసుకున్న వారికి సైతం ఎన్నికల సంఘం ముద్రించిన కొత్త గుర్తింపు కార్డులను జారీ చేస్తుంది. వీటిని ఓటర్లకు వెంటనే చేరేలా తపాలా శాఖ సేవలను ఎన్నికల సంఘం వినియోగించుకుంటుంది. స్పీడ్‌పోస్టు ద్వారా కార్డులను ఓటర్లకు అందేలా చర్యలు చేపట్టింది. రెండు, మూడు రోజులుగా జిల్లాలో తపాలా శాఖ సిబ్బంది వేగంగా కార్డుల పంపిణీ చేస్తున్నారు. కాగా, నియోజకవర్గంలో 5,529 మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారు.
80ఏండ్లు దాటిన వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దే ఓటు వేసేందుకు ఈ దఫా ఎన్నికల సంఘం సౌకర్యం కల్పిస్తున్నది. నియోజకవర్గంలో మొత్తం 180 మంది వృద్ధ ఓటర్లు ఇంటి వద్ద ఓటు వేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ఇంటి వద్దనే ఓటు వేసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే వికలాంగులు 257మంది ఇంటి వద్ద ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం నియోజకవర్గంలో 437మంది ఇంటి దగ్గర ఓటు వేయడం కోసం దరఖాస్తులు చేశారు. జిల్లాయంత్రాంగం వీరందరికీ మంగళ, బుధ వారాల్లో రెండు రోజులపాటు ఓటు వేయించే ఏర్పాట్లు చేసింది. అయితే, ఇందు కోసం 8 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముందుగా ఇంటి దగ్గర ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నోటీసు ద్వారా ఓటు వేసే సమయాలను తెలియపరిచారు. ఈ క్రమంలో వృద్ధులు, వికలాంగులు తమ ఓటుహక్కును ఇంటి నుంచి వినియోగించుకోబోతున్నారు.
అయితే, ఇలా దరఖాస్తు చేసుకుని ఓటుహక్కును వినియోగించుకోని క్రమంలో వీరికి జనరల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే వెసలుబాటు ఉండదు. గతంలో ఇలాంటి వసతిని ఎన్నికల సంఘం చేపట్టలేదు. వయస్సు పైబడిన వారికి.. అలాగే వికలాంగులకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడంలో ఇబ్బందులుంటాయని భావించిన ఎన్నికల సంఘం కొత్తగా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల వృద్ధులకు కేంద్రాలకు వెళ్లే పని తప్పింది.
ఓటుహక్కు వినియోగించుకోవడంపై ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఎన్నికల సంఘం కార్యాచరణ చేపట్టింది. ఇందుకు కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారికి కార్డుల పంపిణీ సందర్భంగా ఓటు వినియోగం, దాని ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతిజ్ఞాపత్రం అందజేస్తున్నారు. అలాగే ఆయా సందర్భాల్లో అవసరమైన ఫిర్యాదులకు సంప్రదించాల్సిన 1950 నెంబరును తెలియపరుస్తూ ఓటరు హెల్ప్‌లైన్ వంటి సేవల సమాచారంపై ప్రచారం చేస్తున్నారు. ఇంకాను ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేసేలా సందేశాత్మకంగా పది పేజీలతో కూడిన ఓటరు గైడ్‌ను కొత్త కార్డులతో కలిపి ఇంటికి చేరవేస్తున్నారు. ఇటు పోస్టల్ శాఖ నుంచి అటు బీఎల్వోల ద్వారా పోలింగ్ పేపర్లను అందజేస్తున్న క్రమంలోనూ వీటిని ప్రతి ఓటరుకు చేరవేస్తూ చైతన్యం చేస్తున్నారు.
కొత్తగా ఓటుహక్కు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటింటికీ ఓటరు కార్డులను ఎన్నికల సంఘం అందించే బాధ్యతను చేపట్టింది. ఇక ఇదివరకే ఓటు హక్కు కలిగిన వారు కూడా కొత్త కార్డును పొందేలా వెసలుబాటును కల్పించింది. ఇందుకు సంబంధిత ఓటరు దగ్గరలోని మీసేవా కేంద్రాలను సంప్రదించడం ద్వారా కొత్త కార్డును పొందవచ్చు. తాజాగా విడుదలైన ఓటరు జాబితాలోని ఎపిక్‌కార్డు నెంబరు చెబితే మీసేవ సిబ్బంది అప్పటికప్పుడు ప్రింట్ తీసి కొత్త కార్డును అందజేస్తారు. ఓటరు జాబితాలో ఎపిక్ సంఖ్యను తెలుసుకోవాలంటే సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.