మహబూబ్నగర్, మార్చి 23 : క్షయ.. మెల్లగా విస్తరిస్తూ కలవర పెడుతోంది. వ్యాధి కట్టడి కోసం జిల్లా అధికారులు ఒకవైపు ప్రయత్నిస్తున్నా.. మరోవైపు రోగులు క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో చిన్నారుల్లోనూ ఈ వ్యాధి అధికంగా కనిపిస్తోంది. ఈ ఏడాది కేటాయించినా లక్ష్యంలో భాగంగా బాధితులను గుర్తించడానికి ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. అయితే కొత్తగా క్షయ బాధితులకు పోషకాహార కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు జిల్లాలో 125 మందికి కిట్లు అందజేశారు.
రెండు వారాలకు మించి దగ్గు.. సాయంత్రం వేళ్లలో జ్వరం.. ఆకలి మందగించడం.. బరువు తగ్గడం.. ఛాతిలో నొప్పి.. దగ్గినప్పుడు రక్తం పడటం.. ఇవన్నీ టీబీ వ్యాధి లక్షణాలు. ఎవరైనా కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్తే ఉచితంగా తెమడ పరీక్ష చేసి వ్యాధిని గుర్తిస్తారు.
క్షయ అంటువ్యాధి.. ఇది మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్ క్యూలోసిన్ అనే బ్యాక్టీరియా సోకినప్పడు వ్యాపిస్తుంది. వెంట్రుకలు, గోళ్లు, తప్ప మిగిలిన అన్ని అవయవాల్లోనూ నివసించే ప్రమాదకరమైన సూక్ష్మ క్రిమి ఇది. ఈ బ్యాక్టీరియా అధికంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి భయంకరమైన వ్యాధి కారక క్రిమి గాలి పీల్చుకున్నప్పుడు దేహంలోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా వ్యాధి కారక క్రిమి 90 శాతం మందిలో క్రియారహితంగా ఉంటుంది. పొగ రాయుళ్లు, మద్యపాన ప్రియులు, హెచ్ఐవీ, బాధితులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు వ్యాధి ప్రబలుతుంది.
జిల్లాలోని ప్రైవేట్ దవాఖానలోల వైద్యులు క్షయ బాధితులను గుర్తిస్తే వారి వివరాలు ప్రతినెలా క్షయ నియంత్రణ శాఖకు అందించాలి. ఒక కేసును గుర్తిస్తే ప్రభుత్వం సదరు వైద్యుడికి రూ.100 ప్రోత్సాహక నగదు అందిస్తుంది. బాధితుడికి ఐదు నెలల పాటు పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తే రూ.500 చెల్లిస్తోంది. అయినా ప్రవేట్ వైద్యులు వివరాలు అందించడం లేదు. ప్రైవేట్ చికిత్స తీసుకోకపోవడంతో అది వారి నుంచి ఇతరులకు సోకి మరింతగా ప్రబలుతోంది. బాధితుల వివరాలన్నీ ఈ శాఖ వద్ద ఉన్నట్లయితే సిబ్బంది ఆ రోగుల వివరాల మేరకు చికిత్స తీసుకుంటున్నారా..? లేదా? అనే విషయాలను పర్యవేక్షించి ఆవగాహన కల్పించి వ్యాధి నివారణకు కృషి చేయడానికి వీలవుతుంది.
జిల్లాలో క్షయ బాధితులు కొంత తగ్గుముఖం పట్టారు. అన్ని పీహెచ్సీల్లో మైక్రోస్కోపీ మిషన్, టీబీ సెంటర్, జడ్చర్ల, ఎస్వీఎస్ లో ఉన్న న్యాట్ మిషన్స్ ద్వారా పరీక్షలు చేస్తున్నాం. వీటి ఫలితా లు త్వరగా వస్తాయి. జిల్లాలో ఆశ కార్యకర్తల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి నెల 5 వేల పరీక్షలు చేయగా.. రెండు నెలలోల 161 కేసులు నమోదయ్యాయి. 2025 ఏడాదిలో 1,408 కేసులు, చిన్నారులు 42 మంది ఉన్నారు.
– మల్లికార్జున్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి