నాగర్‌కర్నూల్, జనవరి 6 : ఆదివారం తెలకపల్లిలో వైకుంఠ రథాన్ని ఢీకొని మృతి చెందిన బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య మృతదేహాన్ని ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సోమవారం నాగర్‌కర్నూల్‌లోని జనరల్ దవాఖాన ఎదుట ధర్నాకు దిగారు. ప్రమాదం జరిగిన వెంటనే కేసు నమోదు చేసి మృతదేహాన్ని నాగర్‌కర్నూల్‌కు తరలించారని, మృతదేహాన్ని ఇవ్వమంటే ఇవ్వడం లేదని, పోస్టుమార్టం చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ రోడెక్కి నిరసన తెలిపారు.
12 గంటలకు నాగర్‌కర్నూల్‌కు రమ్మని ఎస్సై చెప్పి సాయంత్రం నాలుగు గంటలవుతున్నా తమను ఎవరూ పట్టించుకోవం లేదని, ఎస్సై రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం డెడ్‌బాడీ ఇవ్వమని అడిగినా దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. దీంతో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో దవాఖాన ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. దీంతో అరగంటపాటు అచ్చంపేట, మహబూబ్‌నగర్, ట్యాంక్‌బండ్ రహదారుల్లో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న సీఐ కనకయ్య ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.