మహబూబ్‌నగర్ టౌన్, సెప్టెంబర్ 2 : మహబూబ్‌నగర్ జిల్లాలో క్రీడాభివృద్ధి వేగంగా జరుగుతున్నది. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చొరవతో క్రీడామైదానాల్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో రూ.17.32 కోట్లతో క్రీడామైదానాలు అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే రూ.2.50 కోట్లతో స్టేడియం మైదానంలో ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. వాలీబాల్, ఆర్చరీ, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, కబడ్డీ, ఖోఖో, హై జంప్, లాంగ్ జంప్ కోర్టులను మంత్రి ఇటీవలే ప్రారంభించారు.
ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం పనులు రూ.6.99 కోట్లతో వేగంగా జరుగుతున్నాయి. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ఆవరణలో రూ.2.65 కోట్లతో మినీ స్టేడియం పనులు చేపడుతున్నారు. భూత్పూర్ మండలంలో రూ.3.40 కోట్లతో స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వాలీబాల్, అథ్లెటిక్స్ అకాడమీ ఏర్పాటు చేయనున్నారు. మహబూబ్‌నగర్ స్టేడియం సమీపంలో ఉన్న బాస్కెట్‌బాల్ కోర్టు నుంచి సోషల్ వెల్ఫేర్ కార్యాలయం స్థలంలో రూ.6.99 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని అన్ని హంగులతో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అకాడమీ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఇండోర్ స్టేడియం పనులు పూర్తయితే క్రీడలకు కొత్త కళ రానున్నది. ఇప్పటికే ఉన్న వనరులతో కోచ్‌లు, పీఈటీలు, దాతల సహకారంతో ఎంతోమంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. త్వరలోనే పనులు పూర్తిచేసి స్టేడియాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నారు.