గద్వాల, నవంబర్ 24 : “కాంగ్రెస్‌కు ప్రజలు 50 ఏండ్లు అధికారం ఇచ్చారు. ఈ కాలంలో వాళ్లకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదు. వాళ్ల పాలనలో కరెంట్, తాగు, సాగునీటి కోసం నానా కష్టాలు పడ్డారు. ఇప్పుడు అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయకుండా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు.” అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా 26, 27, 36 వార్డుల్లో ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించగా ప్రజలు కుంకుమ పెట్టి, పూలు చల్లుతూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ మాలిమ్ షబ్బీర్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ద్వారా కేబినెట్ హోదాలో పదవులు వెలగబెట్టి జిల్లా అభివృద్ధిని మరిచి స్వలాభం చూసుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం బహుజనవాదం ముసుగులో ఓట్లు అడుగుతూ ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారు చెప్పే మాయమాటలు, సినిమా డైలాగులు విని మోసపోతే మరో ఐదేండ్లు గోస తప్పదన్నారు.
ఈనెల 30న జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి గద్వాల మున్సిపాలిటీని అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని కోరారు. 50ఏండ్ల కాంగ్రెస్ పాలన, పదేండ్ల బీఆర్ఎస్ పాలన చూసారు.. అభివృద్ధిని బేరీజు వేసుకొని రాబోయే ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలన్నారు. ప్రతి వార్డులో పల్లె ప్రకృతి వనాలతోపాటు సీసీరోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచేది లేదని జోస్యం చెప్పారు. అభివృద్ధి చేసే వారికి పట్టం కట్టాలని సూచించారు. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మున్సిపాలిటీ అభివృద్ధి గురించి మాట్లాడుతుందని.. ఇంట్లో కూర్చుంటే కనిపించదు.. బయటకొచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. మాయమాటలను ప్రజలు నమ్మరని, అహంకార ధోరణితో మాట్లాడే వారిని గమనించాలన్నారు. కాంగ్రెస్ నాయకులు చేసే డ్రామాలను చూసి గద్వాల ప్రజలు మోసపోవద్దని సూచించారు. బీఆర్ఎస్ను ఆదరిస్తే మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, వైస్‌చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు మురళి, మహేశ్, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
గద్వాల అర్బన్, నవంబర్ 24 : పదేళ్లలో గద్వాల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాం.. మరోమారు ఆదరిస్తే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుందామని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో గట్టు మండలం తప్పెట్లమెర్సు, మల్దకల్ మండలంలోని పెద్దొడి, గద్వాల మండలం కాకులారానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ చేరగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోసగాళ్ల మాటలు నమ్మి ఓటేస్తే నట్టేట మునగడమే తప్పా.. తేలడం ఉండదన్నారు. అప్రమత్తంగా ఉంటూ రెచ్చగొట్టే వ్యక్తులకు ఓటుతో బుద్ధిచెప్పాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణారెడ్డి, తిమ్మప్ప, నర్సింహులు, తిమ్మప్పగౌడ్ తదితరులున్నారు.
గట్టు, నవంబర్ 24 : బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బలిగేర, మాచర్ల, గట్టులో ఆయన శుక్రవారం ప్రచారం నిర్వహించారు. బలిగేర, మాచర్లలో జెడ్పీటీసీ శ్యామల, సర్పంచులు హనుమంతు, సిద్ధిరామప్పతోపాటు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లపాటు కన్నెతి చూడని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓట్ల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. వారి మాటలు నమ్మొద్దని సూచించారు. బీఆర్ఎస్ను మరోసారి ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టంచేశారు. ఓటర్లు చైతన్యవంతులై ప్రజాకర్షణ పథకాలతో ముందుకు సాగుతున్న బీఆర్ఎస్కు మరోసారి అధికారం కట్టబెట్టాలని కోరారు. కాంగ్రెస్ హామీలను ఎవరూ నమ్మరన్నారు. కార్యక్రమంలో కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, ఎంపీపీ విజయ్‌కుమార్, నాయకులు రామన్‌గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.