ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిపోగా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రూపురేఖలే మారి పోయాయి. నాటి సీఎం కేసీఆర్ సారథ్యంలో.. ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. దీంతో సంక్షేమం, అభివృద్ధిలో ఊహించని స్థాయిలో పరుగులు పెట్టింది. సాగు, తాగునీటితో పాటుగా రవాణా, ఇతర రంగాల్లో ఖ్యాతిని చాటేలా అడుగులు వేసింది. ైరైల్వే బ్రిడ్జి పట్టణానికే ఐకానిక్‌లా నిలవగా.. సాగునీటి సమస్యకు చెక్‌డ్యాంతో చెక్ పెట్టి పునర్జీవం తీసుకొచ్చారు. పెద్దవాగును జీవనదిలా మార్చిన మాజీ ఎమ్మెల్యే కరివెన ప్రాజెక్టుతో నియోజకవర్గం సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు వేశారు. దశాబ్దాలుగా జరగని అభివృద్ధి పదేళ్లలోపే జరగడంతో కేసీఆర్‌పై ప్రజలకు అపార నమ్మకం ఏర్పడింది. దీంతో ఓటర్లు 2014, 2018లో ఇక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కే పట్టం కట్టారు.
– మహబూబ్‌నగర్ ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజల జీవితాలు సంతోషంగా సాగాయి. దేశంలోనే నెంబర్‌గా రాష్ర్టాన్ని కేసీఆర్ మార్చగా.. దేవరకద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధికి అడ్డాగా నాటి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మార్చారు. నాటి సమైక్య రాష్ట్రంలో పాలకుల కుట్రకు గురైన దేవరకద్ర నియోజకవర్గంలో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కాయి. వాగులపై చెక్‌డ్యాంలు నిర్మించారు. సాగునీటి రాకతో రెండు సీజన్లలో బంగారు పంటలు పండాయి. కులవృత్తులు జీవం పోసుకున్నాయి. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారింది. గతంలో కేసీఆర్ హయాంలో మంజూరైన పనులకు తిరిగి కాంగ్రెస్ పార్టీ శంకుస్థాపనలు చేస్తున్నారు. కానీ పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యే చేసిన శిలాఫలకాలు శంకుస్థాపన వద్దే నిలిచిపోయా యి. నాటి ఉ మ్మడి రాష్ట్రంలో ని పరిస్థితులు మళ్లా ఒక్కొక్కటికీ రేవంత్ పాలనలో వస్తున్నాయి. యూరియా దొరకడం లేదు.. కరెంట్ ఉండడం లేదు.. రైతుభరోసా రావడం లేదు.. సాగునీళ్లు అంతంతే.. పంటలు ఎండిపోయే పరిస్థితులు దాపురించాయి.. రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించింది.. ఆల హయాంలో దేవరకద్రలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడితే.. నేడు అడ్రస్ కానరాకుండా పోయింది.
దేవరకద్ర నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. అంతకు ముందు ‘కుక్కలు చించిన ఇస్తరులా’ నాలుగు ముక్కలుగా ఉండేది. మొట్ట మొదటి ఎమ్మెల్యేగా సీతమ్మ గెలుపొందింది. కానీ వలస పాలకుల పాలనలో ఆశించిన స్థాయిలో నిధులు లేక ‘ఎక్కడ వేసిన గొంగలి’ అక్కడే అన్న చందంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. నాటి పరిస్థితులు మళ్లీ దేవరకద్ర నియోజకవర్గ ప్రజలు చూడాల్సి వచ్చింది. 2014లో ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని ప్రజలు గెలిపించారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ, అభివృద్ధిలో ఎక్కడ కూడా తగ్గేదేలే అనేలా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్లి నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలిపారు. పాఠశాలలు, ఆలయాలు, రోడ్లు, వంతెనలు, కొత్త భవన నిర్మాణాలు, పరిశ్రమల ఏర్పాటు, సాగునీటి సమస్యకు చెక్‌డ్యాంలతో చెక్‌పెట్టి, పరిశ్రమల ఏర్పాటు ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒకటి కాదు వందల సంఖ్యలో అభివృద్ధిలో ముందు వరసలో నిలిపేందుకు ఆయన కృషి చేశారు.
దేవరకద్ర మొట్టమొదటి ఎమ్మెల్యేగా నాడు టీడీపీ బలపర్చిన అభ్యర్థి సీతమ్మ గెలుపొందారు. వలస పాలనలో అమె ఆలోచనలకు తగ్గట్టు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటైంది. తెలంగాణలో మొట్టమొదటి సారిగా 2014లో గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. ఆయన చేసిన అభివృద్ధిని చూసి 2018లో మళ్లా ఓటర్లు మరో మారు రెట్టింపు మెజార్టీతో ఆలను గెలిపించారు. దీంతో మరింత అభివృద్ధి పనులు చేసి ఆదర్శంగా నిలిచారు. ఆయన అందరికీ అందుబాటులో ఉం టూ.. సేవలు అందిస్తూ అంద రి అభిమానాలు చూరగొన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాడు. కానీ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఓటమి చెందా రు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. దేవరకద్ర ఎమ్మెల్యేగా మధుసూదన్‌రెడ్డి గెలుపొందారు. కానీ బీఆర్ఎస్ పాలనలో ప్రారంభమైన అభివృద్ధి పనులు మాత్రం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా నిధులు లేవని, ఎమ్మెల్యేలుగా గెలుపొందినా ఎలాంటి ప్రయోజనం లేదని చెబుతున్న విషయం అందరికీ విషయమే.
నాడు దేవరకద్ర.. నియోజకవర్గ కేంద్రంతో పాటు, చిన్నచింతకుంట, కొత్తకోట, అడ్డాకుల, భూత్పూర్ మండలాలుగా ఉండేది. విశాలమైన నియోజకవర్గంతో ప్రజలు పరిపాలన పరమైన ఇబ్బందులు పడేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జిల్లాలు, మండలాల పునర్విభజన తర్వాత నూతనంగా కొత్తకోట నుంచి మదనాపూర్, అడ్డాకుల మండలం నుంచి మూసాపేటను నూతన మండలాలు, దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల నుంచి కౌకుంట్ల మండలాలుగా.. కొత్తకోట, భూత్పూర్ను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. సిగ్మెంట్లో ప్రస్తుతం 8 మండలాలు.. 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. అదేవిధంగా దేవరకద్ర మున్సిపాలిటీతోపాటు మరో వైపు తండాలు జీపీలుగా మారుస్తూ 30 గ్రామాలను నూతన గ్రామ పంచాయతీలుగా చేశారు. ప్రజలకు పరిపాలన సౌలభ్యం లభించిందేందుకు తన వంతు కృషి చేసిన ఎమ్మెల్యే ఆలకు ఎప్పటికి రుణపడి ఉంటామనే ఆయా మండల ప్రజలు చెప్పుకొంటారు.
దేవరకద్ర ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆల ప్రతిక్షణం నియోజకవర్గ అభివృద్ధి కోసం పరితపిస్తూ వచ్చారు. ఆయన చేసిన కృషితో 2014 నుంచి 2023 వరకు రూ.5,778 కోట్లతో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. 92,126 మంది రైతులకు రైతుబంధు ద్వారా రూ.950 కోట్లు నేరుగా వారి ఖాతాలోనే జమ చేశారు. 309 చెరువుల మరమ్మతుకు మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ.102 కోట్లు, ప్రతి ఇంటికీ శుద్ధ జలం అందించాలనే సంకల్పంతో 230 వాటర్ ట్యాంకుల నిర్మాణానికి, 730 కిలోమీటర్ల పైపులైన్ ఏర్పాటుకు మిషన్ భగీరథ పథకంలో రూ.95 కోట్లు, రైతుబీమా పథకం ద్వారా వివిధ కారణాలతో మృతి చెందిన 1,900 మంది రైతు కుటుంబాలకు రూ.99.50 కోట్లు, గొర్రెల కాపరులను ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో 8,619 యూనిట్లకుగానూ రూ. 107.73 కోట్లు, ఆడ పిల్లల తల్లిదండ్రులు పెళ్లి చేయడానికి భారంగా భావించకూడదనే లక్ష్యంతో అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా 11,500 మంది కుటుంబాలకు రూ.95 కోట్లు అందజేశారు. మత్స్యకారుల అభివృద్ధికి రూ.31 కోట్లతో 7.71 చేపపిల్లలను ఉచితంగా అందజేశారు. భూగర్భ జలాల పెంపునకు వాగులపై 30 చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.190 కోట్లు, దళితబంధు ద్వారా 100 మందికి రూ.10కోట్లు, మరో 1100 మందికి ప్రతిపాదనలో ఉండిపోయింది. 37 రైతు వేదికల నిర్మాణానికి రూ.8.14 కోట్లు, మన ఊరు-మనబడి పథకం ద్వారా 93 పాఠశాలల అభివృద్ధి కోసం రూ.17 కోట్లు, గూడులేని ప్రతి వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలంనే లక్ష్యంతో 2,296 నిర్మాణానికి రూ.115.72 కోట్లు, కొత్తకోట, భూత్పూర్ మున్సిపాలిటీల అభివృద్ధికి కోసం రూ.80 లక్షలు, ఆర్అండ్బీ బీటీ రోడ్లు నిర్మాణానికి రూ.250 కోట్లు, పంచాయతీరాజ్ బీటీ రోడ్లకు రూ.81 కోట్లు, వంతెనల నిర్మాణాల కోసం రూ.90 కోట్లు, సీసీ రోడ్ల ఏర్పాటు కోసం రూ.50 కోట్లు, సీడీపీ ద్వారా రూ.30 కోట్లు, మెరుగైన విద్యుత్ అందించడం కోసం రూ.259 కోట్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 1,100 మందికి గానూ రూ.105 కోట్లతోపాటు సాగు, తాగునీటికి శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన కురుమూర్తిరాయ (కర్వెన)ప్రాజెక్టుకు ఇప్పటి వరకే రూ.33 వేల కోట్లు పనులు జరిగాయి. వాటితోపాటు 2023 ఎన్నికలకు ముందు మరిన్ని అభివృద్ధి పనులు చేశారు. ఇలా చెప్పుకొంటూపోతే పల్లెలు, పట్టణాలలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు వర్ణణాతీతం. అదేవిధంగా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రానికి 100 పడకల దవాఖాన, కొత్తకోటలో 30 పడకల వైద్యశాలకు నాటి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు భూమి పూజ చేశారు. గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతల సాగునీరు తీసుకురావడంతో రైతులకు పంటలు బాగా పండి సంతోషంగా ఉండేలా కృషి చేశారు. ఏ పల్లెకు.. ఏ వాడకు వెళ్లినా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చేసిన ప్రగతి కండ్లకు కట్టినట్లు కనిపిస్తున్నది. ప్రజల గుండెళ్లోంచి కేసీఆర్‌ను, మాజీ ఎమ్మెల్యే ఆలను ఎప్పటికీ చరపలేరు.
2017 జూలై 25వ తేదీన మూసాపేట మండలం నిజాలాపూర్ పెద్దవాగు పొడవునా, తర్వాత 2018 ఆగస్టు 18వ తేదీన నాటి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వ ర్‌రెడ్డి కాలినడక చేపట్టారు. ఎడారిగా ఉన్న వాగుకు పునర్జీవం తెచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని మాటిచ్చారు. 2018లో గ్రామాల వారీగా మూసాపేట, పోల్కంపల్లి, కొమిరెడ్డిపల్లి శివారులోని వాగుప్రాంతంలో పర్యటించారు. జిల్లా మంత్రుల సహకారంతో కేసీఆర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా.. ఆయన నిధులు మంజూరు చేశారు. దీంతో పెద్దవాగు, ఊకచెట్టు వాగుపై మొత్తం 21 చెక్‌డ్యాంలను రూ.170 కోట్లతో విడుతల వారీగా నిర్మించారు. దీంతో నాడు ఎడారిగా ఉన్న పెద్దవాగు నేడు ఏడాది పొడవునా నీటితో కళకళలాడుతోంది. భూగర్భజలాలు పెరిగి ఏడాదికి మూడు పంటలు పండిస్తూ కేసీఆర్.. మాజీ ఎమ్మెల్యే ఆల కృషిని కొనియాడుతున్నారు.
అభివృద్ధి గురించి అడిగితే మీ పాయింట్లో తొండల్ ఇడుస్తాననడం.. పింఛన్ ఎందుకు రావడం లేదని అడిగితే ఇంకేదో కారణాలు చెప్పి తప్పించుకోవడం కాంగ్రెస్ నాయకులకు పరిపాటిగా మారింది.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దేవరకద్ర నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము తీసుకొచ్చిన కార్యక్రమాలనే ప్రారంభించి చేతులు దులుపుకొంటున్నారు. మరికొన్నింటిని కొత్తగా జీవోలు ఇచ్చి మేమే తీసుకొచ్చామని చేసిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ధి కనిపించడం లేదు. నియోజకవర్గంలో 60వేలకు పైగా ఎకరాలకు సాగునీరు ఇచ్చే కరివెన రిజర్వాయర్లు పడావు పడేశారు. ఏదో పీకుతాం నాట్తం అని చెప్పి రెండుసార్లు కరివెన రిజర్వాయర్ పైకి వెళ్లి పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటికి తట్టెడు మట్టి కూడా తీయలేక పోయారు. మేము వాగుల్లో వంకలపై నిర్మించిన చెక్ డ్యాములే ఇప్పటివరకు కనిపిస్తున్నాయి.. ఆ జలకళ చూస్తుంటే కడుపు నిండిపోతుంది. దేవరకద్ర నియోజకవర్గంలో చిత్తశుద్ధితో అభివృద్ధి చేయాలి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం..
– ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, దేవరకద్ర