మద్దూర్, ఫిబ్రవరి 10 : కాంగ్రెస్ ప్రభుత్వంలో జనాలకు కూల్చివేతల భయం పట్టుకున్నది. ప్రజా సంక్షేమానికి పాటుపడుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపుతోంది. ఇప్పటికే హై దరాబాద్తోపాటు పలు పట్టణాల్లో అక్ర మ నిర్మాణాలంటూ కూల్చివేతలు కొనసాగగా.. ప్రస్తుతం గ్రా మాల్లోనూ కొనసాగుతోంది. సోమవారం సీఎం రేవంత్రెడ్డి ఇలాకాలో కూల్చివేతలు కొనసాగాయి. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రేనివట్లలో రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని కొన్ని ఇండ్లను అధికారులు కూల్చివేశారు. రేనివట్లలోని దర్గా నుంచి ఎస్సీ కాలనీ మీదుగా మోమినాపూర్కు వెళ్లే 16 ఫీట్ల సీసీ రోడ్డును 27 ఫీట్లకు విస్తరించే పనుల్లో భాగంగా 8 ఇండ్లను జేసీబీతో కూల్చివేశారు. సుమారు 500 మీటర్ల వరకు నిర్మాణాలు కూల్చివేశారు.
నోటీసులు ఇవ్వకుండా.. ముందస్తు సమాచారం లేకుండా ఒక్కసారిగా ఆర్అండ్బీ అధికారులు హిటాచీతో గ్రామానికి చేరుకొన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా అడ్డంగా ఉన్న నిర్మాణాలను కూల్చివేసేందుకు వచ్చారు. దీంతో స్థానికులు అడ్డుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. నష్ట పరిహారం ఇవ్వకుండా ఇండ్లు కూల్చివేస్తే ఎలా అని నిలదీశారు. అందులో ఇతర పార్టీ నేతలు, పేదల ఇండ్లను కూల్చడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరించడం మంచిదే.. అందరికీ రవాణా సౌకర్యం బాగుంటుంది.. కానీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేస్తారని మండిపడ్డారు.
ఇండ్లకు పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా గ్రామపంచాయతీగా ఉన్న రేనివట్ల పది రోజుల కిందట మున్సిపాలిటీగా మారింది. అయితే మూడు నెలల కిందట అధికారులు స్థానిక గ్రామపంచాయతీ అధికారులు గ్రామసభ నిర్వహించారు. అందులో రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోయే బాధితులకు ప్రభుత్వ పథకాలను అందిస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉదయం అధికారులు గ్రామంలోకి చేరుకొని ఇండ్లను తొలగించారు. ఈ విషయమై మద్దూర్ మున్సిపల్ కమిషనర్ నాగరాజును వివరణ కోరగా నష్ట పరిహార విషయమై కలెక్టర్కు నివేదిక అందజేస్తామని చెప్పారు.