DTF | అచ్చంపేట, జూన్ 1 : ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం ద్వారా ముఖ్యంగా ఈ దేశంలోని దళిత, బహుజనుల, పేద వర్గాలకు చదువు దూరమవుతుందని, ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను విరమించుకోవాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి. గోవర్ధన్, జే. రామస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ వేసవి కాలమంతా ఉపాధ్యాయులకు, అధికారులకు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం, ఎంతో హడావుడి చేస్తూ మే మాసం మొత్తం ట్రైనింగ్స్, బాధ్యతలు, ఎన్రోల్మెంట్ పెంచాలని ఉపాధ్యాయులకు చెబుతూ, మరోపక్క ప్రాథమిక విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ఈ సర్దుబాటు ప్రక్రియను తీసుకురావడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి నిజంగా పేద వర్గాల బిడ్డలకు నైపుణ్యమైన విద్యను అందించాలనే తపన ఉన్నట్లయితే, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి కాకుండా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడ్ని, తరగతికి ఒక గదిని నిర్మించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వం తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశాలు మే నెల ప్రతి శుక్రవారం పెడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని సూచిస్తూ, ప్రాథమిక స్థాయిలో 1 నుండి 10 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడని, 10 నుండి 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులని నియమించాలని చెప్పడం, ఒక అశాస్త్రీయమైన, అసంబద్ధమైన విధానాలని ఈ విధానాన్ని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది పేద ప్రజల బిడ్డలకు నైపుణ్య విద్యను అందకుండా చేయడంలో భాగమేనని, తద్వారా విద్యారంగాన్ని ప్రైవేటు శక్తులకు అప్పగించడం జరుగుతుందని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాగర్ కర్నూల్ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా నిరసిస్తూ తక్షణమే సర్దుబాటు ప్రక్రియ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.