గద్వాల, మే 7 : వ్యవసాయ మార్కెట్ రక్షణ గోడ కూ ల్చిన వారిపై రాష్ట్ర మార్కెటింగ్ డైరెక్టర్ సీరియస్‌గా ఉన్న ట్లు తెలిసింది. కూల్చి వేసిన వారిపై చర్యలు తీసుకోవడం లో భాగంగా గద్వాల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిని పూర్తి వివరాలు పంపాలని ఆదేశించారు. గద్వాలలో వ్యవసాయ మార్కెట్ నిర్మాణ సమయంలో రైతుల ధాన్యానికి రక్షణగా గోడను నిర్మించారు. అయితే అధికార పార్టీ నా యకుల అండదండతో ఎటువంటి అనుమతులు లేకుం డా మార్కెట్ యార్డుకు ఉన్న రక్షణ గోడను కమీషన్ మ ర్చంట్లు కూల్చివేయడంతో పాటు వ్యవసాయ మార్కెట్, మున్సిపాలిటీ అనుమతులు లేకుండా అక్కడ ఉన్న పాత డ్రైన్‌ను తొలగించి దాని స్థానంలో కొత్త డ్రైన్ నిర్మించారు.
అంతటితో ఆగకుండా డ్రైన్‌పై స్లాబ్ వేసి రైల్వేస్టేషన్ పైవు దుకాణాలు ఏర్పాటు చేయడానికి కమీషన్ మర్చంట్ సభ్యులు పూనుకున్నారు. అందులో భాగంగా ఇక్కడి అధికార పార్టీ నాయకుడి అండదండలతో రక్షణ గోడ కూల్చేశారు. ఈ విషయంపై మార్కెట్ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ ఆస్తులను యథేచ్ఛగా కమీషన్ మర్చంట్లు మార్కెటింగ్ శాఖ అనుమతి లేకుం డా తొలగిస్తే రక్షణగోడ కూల్చిన వారిపై పోలీసులకు ఫి ర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ విస్మయం వ్యక్తం చేసింది. దీనిని బట్టి చూస్తే జిల్లాలో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడలేని వ్యవస్థ ప్రజల ఆస్తులను ఏమి కాపాడుతారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ స్థలమే కదా కబ్జా చేద్దాం..
ప్రభుత్వ స్థలమే కదా కబ్జా చేస్తే ఎవరు ఏమి చేస్తారనే ధీమాతో కమీషన్ మర్చంట్లు అధికార పార్టీ నేతల అండ తో మార్కెట్‌కు ఉన్న రక్షణ గోడను కూల్చేశారు. గతంలో మార్కెట్ నిర్వహణకు నిధుల సమస్య ఏర్పడడంతో 1974లో గద్వాల రైల్వేస్టేషన్ రోడ్డుకు ఆనుకొని ఉన్న కొంత స్థలాన్ని ప్లాట్లుగా అప్పటి మార్కెట్ విలువ ప్రకా రం 26 మందికి విక్రయించారు. ఇక్కడ విక్రయించిన వ్యాపారులు దుకాణాలు నిర్మించుకున్నారు. మార్కెట్ యార్డు రక్షణ గోడకు, వ్యాపారులు నిర్మించుకున్న భవనాల మధ్య ఖాళీ స్థలం ఉన్నది. ఇది ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ధాన్యం తరలిం చడానికి బండ్ల బాట ఉం డేది. దీనిని రానురాను అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆ దారిని మూసివేసి ఎవరి దుకాణం ముందు ఉన్న ఖాళీ స్థలాలను వారు కబ్జా చేశారు.
2016లో దుకాణాల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని విక్రయించాలని వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి అధికార పార్టీ నాయకుడి ఆదేశంతో యార్డు అధికారులు స్థలాన్ని వ్యాపారులకు విక్రయించారు. రిజిస్ట్రేషన్ సమయంలో కొన్ని నిబంధనలు మార్కెట్ అధికారులు విధించారు. మార్కెట్ యార్డుకు చెందిన ప్రహరీ, ఏ ఇతర నిర్మాణాలకు ఆ టంకం కలిగించరాదని నిబంధనల్లో పొందుపర్చారు. అయినా అధికార పార్టీ నేత అండతో మార్కెట్ రక్షణ గోడను కూల్చి అక్కడ ఉన్న డ్రైన్‌పై స్లాబ్ చేసి దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మార్కెట్ నిబంధనలు తుంగలో తొక్కి వ్యాపారులు గోడను కూల్చి వేశారు. వారిపై సహకార చట్టం ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశం ఉండడంతో వ్యాపారులు అధికార పార్టీ నేతను ఆశ్రయించగా ఆ నేత అభయ హస్తం ఇచ్చినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అక్కడ ఓ డబ్బాను ఏర్పాటు చేశారు.
ఆరు మాసాలకు స్పందించిన మార్కెటింగ్ శాఖ..
సామాన్యులు ఏదైనా ఆక్రమిస్తే ఆగమేఘాల మీద చర్యలు తీసుకునే అధికారులు మార్కెట్ రక్షణ గోడ కూల్చివేతపై ఆరు మాసాలైనా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఎట్టకేలకు గద్వాల వ్యవసాయ మార్కె ట్ రక్షణగోడ కూల్చివేతపై మార్కెటింగ్ శాఖ స్పందించింది.ప్రహరీ ఎందుకు కూల్చాల్సి వచ్చింది? ప్లాట్లు అమ్మే సమయంలో ఎటు వంటి షరతులు పెట్టారు, గతంలో ప్లాట్లు విక్రయించారు. ప్రస్తుతం ఎందుకు విక్రయించాల్సి వచ్చింది, విక్రయిస్తే ఎంతకు విక్రయించారు? విక్రయ సమయంలో షరతులు ఏంటీ తదితర వాటిపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించింది.
ఈ నివేదిక ఆధారంగా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కమీషన్ మర్చంట్లతో తిరిగి ప్రహరీ నిర్మాణం చేసేందుకు నోటీసులు జారీ చేసి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రమార్కెటింగ్ ఆదేశాలతో అప్రమత్తమైన జిల్లా అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. కూల్చివేసిన రక్షణ గోడ నిర్మించాలంటే రూ.40లక్షల వ్య యం అవుతుతుందని ప్రతిపాదనలను తయారు చేయడంతోపాటు పూర్తి నివేదిక అధికారులు సిద్ధం చేసి రాష్ట్ర మార్కెటింగ్ అధికారులకు పంపినట్లు తెలిసింది. ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి రక్షణ గోడ కూల్చిన వారిపై చర్యలు తీసుకొని వారి చేత రక్షణ గోడ నిర్మించాలని రైతులు కోరుతున్నారు.