మహబూబ్‌నగర్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఓ దళిత యువతి లైంగికదాడి.. ఆపై హత్య జరిగి 13 రోజులు అవుతున్నా ఇంకా మిస్టరీ గానే మారింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు సామూహికంగా లైంగికదాడికి పాల్పడి హత్య చేశారని ఆరోపిస్తున్నా పోలీసు యంత్రాంగం మాత్రం మౌన వహించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనికి రాజకీయ ఒత్తిల్లే కారణమనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మిగతా నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శంషాబాద్‌లో దిశా ఘటన మాదిరిగానే నిందితులను ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్ దళిత సంఘాలు చేస్తున్నాయి. అగ్రవర్ణాలకు ఓ న్యాయం దళితులకు ఓ న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం గ్రామానికి వచ్చిన ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఈ ఘటనపై కుటుంబ సభ్యులకుతోపాటు గ్రామస్తులతో విచారణ జరిపింది. యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడి హతమార్చి ఉండొచ్చు అన్న అనుమానాలను వ్యక్తం చేశారు. వెంటనే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ప్రధాన నిందితుడిని ఎందుకు పోలీస్ కస్టడీ తీసుకోలేదని బహిరంగంగా ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది.
యువతిపై జరిగింది సామూహిక లైంగిక దాడి హత్య అని ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఒక అభిప్రాయానికి రావడం.. ఈ కేసులో నిండితుడిని కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా విచారించాలని ఏకంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ మహబూబ్‌నగర్ డీఎస్పీని ఆదేశించడం సంచలనాత్మకంగా మారుతుంది. కాగా ఈ కేసులో పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి హడావిడిగా ప్రధాని నిందితుడి పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి ఇక ఈ కేసు మొత్తం ముగిసిపోయిందని చేతులు దులుపుకొన్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే పలు దళిత , మహిళ సంఘాలు, నిజనిర్ధారణ కమిటీలు వేసి లోతుగా విచారించారు. ఈ విచారణలో కూడా నిందితులు ఒక్కరు కాదు మరి కొంతమంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నిజ నిర్ధారణ నివేదికను కూడా కలెక్టర్, ఎస్పీలకు సమర్పించారు. అయినా పోలీసులు మాత్రం అలాంటిది ఏమీ లేదని పోస్టుమార్టం నివేదిక అంటూ దాటవేశారు. తీరా పోస్టుమార్టం నివేదిక వచ్చాక నివేదికలో ఏమీ లేదని పూర్తిస్థాయిలో ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఫోరెన్సీక్ విభాగానికి పంపినట్లు చెబుతున్నారు. మొత్తంపైన దళిత యువతి లైంగికదాడి, హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఓ యువతిపై లైంగికదాడి జరిగి హత్యకు గురై ఇన్ని రోజులు గడుస్తున్నా మహిళా ఎస్పీ ఉన్న జిల్లాలో దళితులకు న్యాయం దక్కడం లేదని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో ఈ నెల 17న రాత్రి సమయంలో గ్రామానికి చెందిన దళిత యువతిపై లైంగికదాడి, హత్య ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన మరుసటి రోజు (డిసెంబర్ 18న) ఉదయం బంధువులు మరణించిన యువతి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై అనేకచోట్ల తీవ్ర గాయాలు ఉన్నాయి. వీపు వెనుక భాగంలో మూడు చోట్ల బలమైన గాయాలు తగిలాయి. అక్కడి నుంచి కూడా రక్తం కారుతోంది. కుడి ఎడమ చెవులకు దగ్గర కూడా శరీరం కందిపోయి ఎర్రగా మారింది.. ఇక్కడ కూడా రక్తం బయటికి వచ్చిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి అని బంధువులు అంటున్నారు. ఇక గొంతుపై కూడా ఎర్రగా గాయాలు ఉన్నాయి అని చెబుతున్నారు. మరి కొన్ని చోట్ల రక్తపు మరకలు కూడా ఉన్నాయి. అరికాళ్ల దగ్గర రక్తపు మరకలు తీవ్రస్థాయిలో ఉన్నాయని కూడా సమీప బంధువు అంటున్నారు. వీటన్నింటినీ వాళ్లు వీడియో తీశారు.. (ఈ వీడియో నమస్తే తెలంగాణ చేతికి చిక్కింది.) ఇది పరిశీలిస్తే ముమ్మాటికి ఇది ఒక్కరి వల్ల జరిగిన పని కాదని తేలిపోయింది.. ఇదిలా ఉండగా ఎస్పీ ప్రెస్మీట్లో ఎక్కడా కూడా యువతికి గాయాలైనట్టు పేర్కొనలేదు.. కనీసం ఘటనా స్థలంలో ఏం జరిగిందో కూడా మీడియాకు వివరించలేదు.
తమ కూతురిది మామూలు మరణం కాదని భావించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మూసాపేట పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. మృతురాలి తండ్రి శ్రీనివాసులు ఇంటి దగ్గరనే తమ కూతురి చావుకి సంఘ విష్ణుతోపాటు మరికొంతమంది ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు రాసుకొని వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత పోలీసులు ఆ ఫిర్యాదును పక్కకు పడేసి వేరే ఫిర్యాదును రాసుకున్నారని మృతురాలి తండ్రి శ్రీనివాసులు ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. తామ ంతా ఒక్కరు కాదు ముగ్గు రు నలుగురు ఉండొచ్చని అంటున్నప్పటికీ పోలీసులు ద బాయించి మాకు అంతా తెలుసు అంటూ ఒక్క పేరు మీద ఫిర్యాదు వాళ్లే రాయించి తనతో సంతకం తీసుకున్నారని రోధిస్తూ తెలిపారు.
పథకం ప్రకారం ఈ కేసులో ఏదో జరుగుతుందనేది అర్థమవుతుంది. ఇదంతా చూస్తుంటే పోలీసులు ఈ కేసులో ఏదో దాస్తున్నారని బలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూసాపేట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 207/2025 కింద పోలీసులు కేసు నమోదు చేసి సెక్షన్ 64 , 105 బీ ఎన్ ఎస్ 3(2)(va) ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఒక్కడే నిందితుడని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆదేశాలతోనైనా నిజం బయటపడుతుందా? మిస్టరీ వీడుతుందో లేదో వేచి చూడాల్సిందే..
మూసాపేట్ మండలం వేముల గ్రామంలో దళిత యువతి నీ గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని లేదా సీబీసీఐడీతో దర్యాప్తు చేపట్టాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్‌బాబు డిమాండ్ చేశారు. సోమవారం కేవీపీఎస్ నిజనిర్ధారణ బృందం తల్లిదండ్రుల నుంచి ఘటన పూర్వపరాలు అడిగి తెలుసుకున్నా రు. డిసెంబర్ 17న జరిగిన లైంగికదాడి హత్యలో కేవలం ఒక్కరే నిందితుడిగా పోలీసులు చూపుతున్నారని కానీ.. అది గ్యాంగ్ రేప్, హత్య అని చెప్పారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం లాంటి అనేక చట్టాలు ఉన్నప్పటికీ దళితులపై దాడులు, లైంగికదాడులు, హత్యలు ఆగడం లేదన్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.