ధరూరు, ఫిబ్రవరి 26 : యాసంగి సాగుకు ఈ కరెంట్ కష్టాలు ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించిన ఘటన మండలంలో చోటు చేసుకున్నది. మండలంలోని అల్వాల్పాడులో రైతులకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. దీంతో విసిగిపోయిన రైతు లు గ్రామంలోని సబ్‌స్టేషన్ ఎదుట బుధవారం బైఠాయిం చి నిరసన తెలిపారు. కాల్వకు నీళ్లు వదిలి కరెంట్ తీస్తం అంటే సేద్యం ఎలా సాధ్యమవుతుందని మండిపడ్డారు. సాగుకు కాళ్లేళ్ల పడి నీరు వదిలించుకుంటే, ఇక్కడ సబ్‌స్టేషన్‌లో కరెంట్ తీస్తే మోటార్లు ఎలా నడిసేది, పంటలు ఎలా తడుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏమి కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకు ఈ కష్టాలు మాకు అంటూ కేటీదొడ్డి మండలంలోని మైలగడ్డ, బస్వాపురం, ఉమిత్యాల తండాల రైతులు సబ్‌స్టేషన్ అధికారులపై మండిపడ్డారు. రైతులు పంటలు పండించుకోవాలో లేక పంటలు ఎండిపోయి ఆగం కావాలో మీరే నిర్ణయించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ హయాంలో సాగునీటికి ఇబ్బంది లేదు.. కరెంట్‌కు పడిగాపులు లేవు కానీ ఈ ప్రభుత్వం హయాంలో ఎప్పుడు ఏదొక సమస్య రైతుపై పడుతుందని మండిపడ్డారు.