అన్నదాతలు వానకాలం సాగుకు సమాయత్తమవుతున్నారు. వర్షా ధార పంటలు సాగు చేసే రైతులు ఇప్పటికే పొలాలను దుక్కి దున్ని చదును చేస్తున్నారు. రోహిణి కార్తె తర్వాత కురిసే వర్షాల ఆధా రంగా నాట్లు వేయనున్నారు. పంటల సాగు అంచనా మేరకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో వానకాలం సీజన్లో 5.94 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. గతేడాది కంటే ఈసారి 18 శాతం అధికంగా సాగు కావొచ్చని అంచనా. పత్తిని అత్యధికంగా 3,63,635 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏఈవోలు కర్షకులకు సలహాలు, సూచనలిస్తున్నారు.
నాగర్‌కర్నూల్, మే 16 (నమస్తే తెలంగాణ) : వానకాలం పంటల సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ఈసారి వర్షాలు ముందుగానే కురుస్తాయనే అంచనాతో సాగుకు సమాయత్తమవుతున్నారు. దీంతో వ్యవసాయశాఖ సైతం రైతులకు అవసరమైన ఎరువులతోపాటు పంటల సాగుపై అంచనాలు రూపొందించింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ వానకాలంలో 5.94లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు.
వానకాలానికి సంసిద్ధం
వానకాలం పంటల సాగుకు అధికారుల అంచనాలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ ఆదేశంతో జిల్లాలోని వ్యవసాయశాఖ అధికారులు ఈ సీజన్లో రైతులు పండించే పంటలపై నివేదికలు రూపొందించారు. గత సీజన్‌తో పోల్చి చూడగా.. ఈసారి సాగులో మార్పులు చోటుచేసుకోనున్నాయి. వానకాలం రానుండడంతో వ్యవసాయశాఖ ఏఈవోల ద్వారా సాగు అంచనాలు తయారు చేసింది. దీని ప్రకారంగా రైతులు ఏయే పంటలు, ఎంత విస్తీర్ణంలో సాగుచేస్తారనే నివేదికను తయారుచేశారు. రైతులు ముందస్తుగా సేద్యం చేసేందుకు ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా క్షేత్ర పర్యటనల తర్వాత రైతువేదికల్లో ఏఈవోలు ప్రతిరోజూ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండనున్నారు. వారానికి రెండుసార్లు రైతులకు పంటల సాగు, సమస్యలపై ఏఈవోలు వివరించనున్నారు. దీంతో విత్తినప్పటినుంచి పంట మార్కెట్‌కు తరలించే వరకు అవసరమైన సలహాలు, సూచనలు
అందించనున్నారు. సింగిల్‌విండోల ద్వారా మార్కెట్లో రైతులకు అవసరమైన విత్తనాలను కూడా అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధులను కూడా త్వరలోనే ఖాతాలో జమచేయనున్నది. ఇలా ప్రభుత్వం వానకాలం సాగుకు చర్యలు తీసుకుంటుండగా అన్నదాతలు సైతం సేద్యానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వేసవి దుక్కులు ప్రారంభించగా.. ఇటీవల కురిసిన వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో భూములు చల్లబడ్డాయి ఈసారి ముందస్తు వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ సూచనలతో రైతులు వానకాలం ప్రారంభంలోనే విత్తేందుకు సిద్ధమై భూసార పరీక్షలు చేయిస్తున్నారు. పప్పు, నూనె గింజ పంటల సాగు చేపట్టాలని రైతులకు ఏఈవోలు వివరిస్తున్నారు.
పత్తి సాగుకు రైతుల మొగ్గు..
నాగర్‌కర్నూల్ జిల్లాలో 13లక్షల ఎకరాల భూములు ఉండగా.. వానకాలంలో 5,94,198 ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. 2020 వానకాలంలో 6,13,878 ఎకరాల్లో సాగు చేయగా, 2021లో 5,44,433 ఎకరాల్లో, 2022లో 4,92,055 ఎకరాల్లో సాగు చేశారు. ఈసారి గతానికంటే 18శాతం అధికంగా సాగు చేయొచ్చని అధికారుల అంచనా. కాగా ప్రధానంగా పత్తిపంటను 3,63,635 ఎకరాల్లో సాగు కానుంది. ఆ తర్వాతి స్థానంలో వరి 1,29,710 ఎకరాల్లో, మొక్కజొన్న 41,564 ఎకరాల్లో, కందులు 4,613 ఎకరాల్లో, జొన్న 2,515 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అంచనా.
పత్తి సాగుకు అన్నదాత ఆసక్తి
ఈ వానకాలంలో పంటల సాగు ప్రణాళికను తయారు చేశాం. పప్పు, నూనెగింజల పంటలు సాగు చేయాలని రైతులకు ఏఈవోల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో 5.94లక్షల ఎకరాలకుగానూ అత్యధికంగా 3.63లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉంది. రైతులు భూములను దున్ని సిద్ధంగా ఉంచుకోవాలి. తొందర పడకుంగా వర్షాలు బాగా కురిసి నేలలో వేడిపోయి తడి వచ్చాకే విత్తనాలు వేసుకోవాలి. ఎలాంటి సందేహాలున్నా రైతువేదికల వద్ద ఏఈవోలను అడిగి నివృత్తి చేసుకోవాలి.
– వెంకటేశ్వర్లు, డీఏవో, నాగర్‌కర్నూల్
2016 నుంచి వానకాలంలో సాగు ఇలా..
సంవత్సరం : సాగు(హెక్టార్లలో)
2016 : 5,42,537
2017 : 5,39,830
2018 : 5,12,815
2019 : 5,53,568
2020 : 6,13,954
2021 : 5,44,865
2022 : 4,92,055
2023(అంచనా) : 5,94,198