గద్వాల, జనవరి 1 : ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయంతో పంటల సాగు సంబురంగా సాగుతున్నది. పదోవిడుత రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుండడంతో యాసంగి పంట పెట్టుబడికి రంది లేకుండాపోయింది. ఇప్పటికే సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రైతులు కొంతమేర వరిపంట సాగు చేయగా, ప్రభుత్వ సూచనలు.. వ్యవసాయశాఖ అధికారుల సలహా మేరకు ఉమ్మడి జిల్లాలో రైతులు ఇతర పంటలను సాగు చేశారు. రైతులు పంట సాగు చేసే సమయానికి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం రైతుబంధు జమ చేయడంతో రైతులు సంబురంగా వ్యవసాయం చేయడానికి ముందుకు సాగుతున్నారు.
జిల్లా రైతులు యాసంగిలో కందులు, మొక్కజొన్న, వేరుశనగ, పప్పుశనగ, వరి, ఆముదం, పెసర్లు, మినుములు, జొన్న, నువ్వులు, కుసుమ పంటలు సాగు చేయనున్నారు. జిల్లాలో ఇప్పటికే వేరుశనగ, పప్పుశనగ, మినుములు, వరిపంట సాగు చేశారు. పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం సాయం అందించడంతో రైతులు ఎరువులు కొనుగోలు చేసి పంటచేలకు వేయడానికి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం సరైన సమయంలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుండడంతో రైతులు ఆసాముల వద్దకు అప్పుకోసం పోవాల్సిన అవసరం లేకుండాపోయింది. రైతుబంధు పథకం గతనెల 28న ప్రారంభమై విడుతల వారీగా ఇప్పటివరకు నాలుగు రోజులుగా ఎకరా, రెండు, మూడు, నాలుగు ఎకరాల రైతులకు పెట్టుబడి సాయం అందింది. ఇలా నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఈనెలలో పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఇప్పటివరకు 9,58,997మంది రైతులకు లబ్ధి
ప్రభుత్వం అందించిన రైతుబంధు సాయంతో ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 9,58,997మంది రైతులకు లబ్ధి చేకూరింది. వీరి ఖాతాల్లో ప్రభుత్వం రూ.479,49,85000 కోట్లు జమ చేసింది. ప్రభుత్వం రైతుల పెట్టుబడి సమయానికి రైతుబంధు జమ చేయడంతో రైతులు సంబురపడుతూ వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఖాతాల్లో పడిన డబ్బులను రైతులు బ్యాంకులకు వెళ్లి విత్డ్రా చేసుకుంటున్నారు. ఏ ప్రభుత్వం కూడా రైతులకు గిట్ల సాయం చేయలేదని రైతులు ఒకరినొకరు ముచ్చటించుకుంటున్నారు. మొదటిరోజు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,23,295 మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.117కోట్లు జమచేయగా, రెండోరోజు 1,49,974మంది రైతుల ఖాతాల్లో రూ.166కోట్లు, మూడోరోజు 3,11,173మంది రైతుల ఖాతాల్లో రూ.255కోట్లు, నాల్గోరోజు 1.74వేల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.201.71 కోట్లు జమ చేసింది.