ఊట్కూర్, మే 5 : ఉల్లిధరలు రైతులను కంట నీరు పెట్టిస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన ఉల్లిగడ్డకు మార్కెట్లో ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గత డిసెంబర్, జనవరి నెలల్లో క్వింటాకు రూ. 3000 నుంచి రూ. 4000 వరకు ఉల్లి ధర పలికింది. ఈక్రమంలో రైతులు యాసంగి పెద్దఎత్తున ఉల్లిసాగు చేపట్టారు. కరెంట్ కోతలు, యూరియా ఇక్కట్లను భరించిన రైతులు ప్రత్యామ్నాయంగా ఉల్లిసాగు వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం మార్కెట్లో ధరలు అమాంతంగా తగ్గిపోవడంతో రైతులు రోడ్ల పక్కన కూర్చుని 50కిలోల బస్తాను రూ. 300 నుంచి రూ. 500వరకు అమ్ముకుంటున్నారు.
పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా రైతులు గ్రామాలు తిరిగి నిత్యం వందల బస్తాలతో ట్రాక్టర్లు, వాహనాల సాయంతో ఉల్లిని తక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. మరి కొందరు రైతులు ఉల్లి సైజును బట్టి కిలో రూ. 5 నుంచి రూ.10చొప్పున విక్రయిస్తున్నారు. ఉల్లికి మార్కెట్లో ధరలు లేకపోవడంతో పెట్టిన పెట్టుబడులు అందే పరిస్థితి కూడా లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో రేవంత్ సర్కారు ఉల్లి రైతులను ఆదుకునేందుకు కనీస చర్యలు తీసుకోకపోడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లికి ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో 600ఎకరాల్లో ఉల్లి సాగు
నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 600ఎకరాల్లో రైతులు ఉల్లి సాగు చేపట్టారు. అత్యధికంగా నారాయణపేట, పరిసర గ్రామాల్లో 350ఎకరాల్లో రైతులు ఉల్లి సాగు చేపట్టారు. ఊట్కూర్ మండలంలో 150ఎకరాలు, మక్తల్, పరిసర మండలాల్లో మరో 100ఎకరాల్లో ఉల్లి సాగైంది. ఉల్లి నాటేందుకు, ఎరువులు, కలుపు, కోత కూళ్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఎకరాకు రూ. 50వేల నుంచి రూ. 70వేల వరకు పెట్టుబడి ఖర్చయిందని రైతులు వాపోతున్నారు.
ఉల్లికి మద్దుతు ధర లేకపోవడంతో రవాణా, కూలీల ఖర్చులు కూడా తిరిగి రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. కొందరు రైతులు మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతాయనే ఆశతో పొలాల వద్ద చెట్ల నీడన ఉల్లిని నిల్వ చేసుకున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో అకాల వర్షం వచ్చి పంట కుళ్లిపోయే ప్రమాదం ఉందని దిగులు చెందుతున్నారు. మక్తల్, నారాయణపేటలో ఉల్లికి మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో దేవరకద్ర, వనపర్తి వ్యవసాయ మా ర్కెట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో రవాణా, ప్యాకింగ్ చార్జీలు కలిసి తడిసి మోపెడవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పం దించి ఉల్లికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Mahabubnagar
కోల్డ్ స్టోరేజ్‌లు లేక అవస్థలు..
నారాయణపేట జిల్లాలో కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం లేకపోవడంతో ఉల్లి పంటను నిల్వ చేసేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊట్కూర్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు కుమ్మరి మహదేవ్ సర్వే నెంబర్ 89లో మూడెకరాల్లో ఉల్లి పంటను పండించాడు. ఉల్లికి మార్కెట్లో మద్దతు ధర లేకపోవడంతో నెలరోజుల కిందట 200 బస్తాల ఉల్లిని అమ్మకానికి తరలించక పొలంలోనే ఉన్న ఓ చింత చెట్టు కింద నీడకు కుప్ప వేశాడు. కాగా, అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఉల్లిగడ్డ కుప్పకు నిప్పంటించడంతో ప్రమాదవశాత్తు ఉల్లి మొత్తం కాలిపోయింది. రైతు ఆరుగాలం శ్రమించి పండించిన ఉల్లి పంట కళ్లెదుట బుగ్గిపాలు కావడంతో తీవ్ర నిరాశ మిగిల్చింది. ప్రభుత్వ సాయం కోసం బాధిత రైతు ఎదురుచూస్తున్నాడు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైతుకు నష్టం జరిగి నెలరోజులు గడుస్తున్నా అధికారులు, ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
పరిహారం అందించాలి
ప్రభుత్వం ఉల్లి రైతును ఆదుకునేందుకు ఎకరాకు రూ.40వేలు పరిహారం అందించాలి. జాజాపూర్ శివారులో మూడు ఎకరా ల్లో ఉల్లి పంటను సాగు చేశాను. మార్కెట్ సౌక ర్యం లేకపోవడంతో రోడ్డు పక్కన కూర్చుని 50కిలోల బస్తా రూ. 500 విక్రయిస్తున్నా. దూర ప్రాంతంలోని మార్కెట్ తరలించాలంటే రవా ణా, కూలీల ఖర్చు, ఫ్యాకింగ్ చార్జీలు ఎక్కువవుతున్నాయి. ఎకరాకు రూ. 70వేలు పెట్టుబడి ఖర్చయింది. మక్తల్, నారాయణపేట పట్టణాల్లో ప్ర త్యేక ఉల్లి మార్కెట్లను ఏర్పాటు చేయాలి. ప్ర భుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలి. – నరేశ్, ఉల్లి రైతు, జాజాపురం