ఇటిక్యాల, మార్చి 15 : జూరాల ఆయకట్టు కింద వారబంధిపై సాగునీటి విడుదలతో పం టలు ఎండిపోతున్నాయంటూ జూరాల ఆ యకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిఏటా ఏప్రిల్, మే నెల వరకు సాగునీరు అందేదని, ప్రస్తుతం వారబంధితో ప్రతి మం గళ, బుధవారం రెండు రోజులపాటు డీ-31 వరకు నీటిని విడుదల చేస్తుండటంతో ఆయకట్టు కింద సాగుచేసిన వేరుశనగ, కూరగాయ ల పంటలసాగు ఆందోళనకరంగా మారింది.
ఎర్రగరప నేలలు కావడం వల్ల ప్రస్తుతం తీవ్రమవుతున్న ఎండలకు రోజువిడిచి రోజు నీరందిస్తేనే పంటలు కాపాడుకుంటామని తెలిపారు. బోరుబావులు ఊట తగ్గిపోయి మరింత ఇబ్బందికరంగా మారిందని రైతులు వాపోతున్నారు. ప్రతి వేసవిలో కూరగాయలకు ధర బాగుంటుందని ఈ ఏడాది కూడా కూరగాయలు సాగు చేయగా, జనవరి నుంచే వారబంధి ప్రకటించి తమ కడుపుకొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.