కోడేరు, మార్చి 22 : చేతికొచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతుంటే రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పొట్ట దశలో ఉన్న పంటలకు నీళ్లు అందకపోవడంతో చేసేది లేక గొర్రెలకు మేతగా వదిలేశారు. కోడేరు మండలం రాజాపూర్కు చెందిన బొల్లెద్దుల లక్ష్మయ్య 2.20 ఎకరాలు, రాములు 35 గుంటలు, పల్లె దాసు ఎకరాతోపాటు చాలా మంది రైతులు వరి పంటలను సాగు చేశారు. కేఎల్ఐలో భాగంగా డీ-5 కాల్వ ద్వారా సాగునీరు అందేది. మొదట్లో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయని వరి పంటలను సాగుచేయగా, 10రోజుల నుంచి కాల్వ నీళ్లు అందకపోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి.
పొట్ట దశకు వచ్చిన పంట కండ్ల ముందే కనుమరుగవుతుంటే ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా, ఎంజీకేఎల్ఐ డీ-8 కాల్వ ద్వారా డీ-5 కాల్వకు నీళ్లు అందాల్సి ఉంది. అయితే పాన్గల్ మండలం రేమొద్దుల గ్రామ శివారులో కొందరు రైతులు అడ్డంగా సంచులు వేయడంతో కాల్వ నీటి సరఫరా నిలిచిపోయి ఈ దుస్థితి నెలకొన్నదని రైతులు వాపోతున్నారు. 10రోజులుగా నీళ్లు అందకపోవడంతో చేతికొచ్చిన పంటలను గొర్రెలకు మేతగా వదిలేసినట్లు రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అప్పులు తెచ్చి ఎకరాకు రూ.35వేల చొప్పున పెట్టుబడి పెట్టామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
నీళ్ల సవలతు మంచిగా ఉన్నదని వరి పంటలు సాగు చేసినం. పంటలు చేతికొచ్చే సమయంలో నీళ్లు అందక ఎండిపోయినయి. ఎండిన పంటలను చూస్తే కండ్ల నీళ్లు తిరుగుతుండయి. పెట్టుబడి పోయే.. చేసిన కష్టం దక్కకపాయే. తిండి గింజలు లేక పస్తులండాల్సిన పరిస్థితొచ్చింది. సారోళ్లకు చెప్పినా చెవిన పెట్టడం లేదు. సర్కారన్నా సాయం చేసి ఆదుకోవాలే.
– బీ.లక్ష్మయ్య, రైతు, రాజాపూర్, కోడేరు మండలం