గద్వాల, జూన్ 12 : జోగుళాంబ గద్వాల జిల్లాలోని రాజోళి మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే బంగారు పంటలు పండే భూములు నాశనం కావడంతోపాటు, నీరు కలుషితమై, ప్రజలు, మూగజీవాలు రోగాల బారిన పడతారని, పచ్చని పంటలు, పల్లెలను నాశనం చేసే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం మా గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయవద్దంటూ ఓ వైపు 12 గ్రామాల రైతులు, ప్రజలు ఏకతాటిపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అయితే కంపెనీ యజమాన్యం పోలీసు అధికారులు కవ్వింపు చర్యలకు పాల్పడడంతోపాటు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంతో వారు తిరగబడ్డారు.
దీంతో విధిలేని పరిస్థితుల్లో కంపెనీ యాజమాన్యం అక్కడ నుంచి క్యాంప్ ఖాళీ చేసి వెళ్లి పోయింది. ఇక కంపెనీ పీడ పోయిందని, గ్రామాల్లోని ప్రజలు ప్రశాంతంగా ఉంటూ తమ పొలాల్లో విత్తులకు సిద్ధమవుతున్న వేళ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టుడే అని మంగళవారం బాంబు పేల్చారు.
దీంతో ఆయా గ్రామల ప్రజలు మంత్రి మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రజల మద్దతు లేనిది ఎలా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారో మేము చూస్తామని అంటున్నారు. గ్రామసభలు పెట్టకుండా, ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వంతోపాటు పాలకులు యాజమాన్యానికి కొమ్ము కాస్తే చూస్తు ఊరుకోమని 12 గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఒక సారి యాజమాన్యం బౌన్సర్లను తీసుకొచ్చి రైతులను, ప్రజలను కొట్టించే ప్రయత్నం చేస్తే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో మంత్రి ఆలోచించాలన్నారు.
బౌన్సర్లతో కంపెనీ యాజమాన్యం రైతులను కొట్టించే ప్రయత్నం చేయడం, వారికి పోలీసులు సహకరించడంతో కోపోద్రిక్తులైనా రైతులు కంపెనీ యాజమాన్యంపై తిరగబడడంతో 40 మందిపై కేసులు నమోదు చేసి 12మంది రైతులను జైలుకు పంపారు. మరో సారి మంత్రి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. మంత్రి మాటలు రైతులను రెచ్చగొట్టె విధంగా, రైతులు తప్పు చేస్తే వారిని మరోసారి జైలుకు పంపి పనులు ప్రారంభించేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తుందని ఆయా గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు.
పెద్దధన్వాడలో ఇథనాల్ ప్లాంటును ఎటి ్టపరిస్థితుల్లో ఏర్పాటు చేస్తామని, ఇందుకు ఎలాంటి అడ్డంకులు లేవని, కొద్ది రోజులు ఆలస్యం అవుతుందే తప్పా ప్లాంటు ఏర్పాటు ఖాయమని మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించడంపై రైతులు ఆయనపై ఆక్రోశంతో ఉన్నారు. ఎటువంటి అడ్డంకులు లేవని ఎవరు చెప్పారని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు మంత్రిని ప్రశ్నిస్తున్నారు.
12గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీ వద్దని వ్యతిరేకిస్తుంటే.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పడం దేనికి సంకేతం, వీరి మాటలు వేల మంది రైతుల ప్రయోజనాలు, ఒక ఫ్యాక్టరీ యజమానికి తాకట్టు పెట్టినట్లు ఉందనేది ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుపై మంత్రితోపాటు ప్రభుత్వానికి ఎందుకు అంతప్రేమ అనే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారు ఎందుకు కంపెనీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారనేది అంతు చిక్కని ప్రశ్నగానే మిగులుతుంది. మంత్రి శ్రీధర్‌బాబు మాటలపై పెద్దధన్వాడ ప్రజల ఆగ్రహం వారి మాటల్లోనే..
మా ఊరిలో ఉన్న మమ్మల్ని అందరినీ చంపిన తర్వాతే మంత్రి ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకొమను. రాత్రి, పగలు కష్టపడి పంటలు పండించుకొని పొట్టపోసుకునేటోళ్లం. మాపొట్టమీద కొట్టడం ఎంతవరకు న్యాయం. మాకు ఆ ఫ్యాక్టరేవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టవద్దు. మా పిల్లల భవిష్యత్ మాకు ముఖ్యం. ఫ్యాక్టరీ నిర్మాణంపై ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ. వద్దంటే ఏర్పాటు చేస్తామనడంలో వారికి రైతులపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది.
– ఓబులేశు, రైతు, పెద్దధన్వాడ, జోగుళాంబ గద్వాల
మా పంట పొలాలు నాశనం చేయడంతో పాటు, ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే ఈ ఫ్యాక్టరీ మాకొద్దు. ప్రాణాలు పోయినా ఫర్వాలేదు కానీ ఫ్యాక్టరీ నిర్మాణం అడ్డుకుంటాం. బెటాలియన్‌ను దింపుకొంటారో, పోలీసులను ఎంత మందిని దింపుకొంటారో దింపుకోమనండి. ఫ్యాక్టరీ నిర్మాణం పక్కనే దళితులకు 150 ఎకరాల భూమి, ప్లాట్లు ఇచ్చారు. వారు ఎక్కడికి పోవాలి. 40 మంది మీద కేసులు చేశారు. ఇంకా ఎంతమంది మీద కేసులు చేస్తారో చేయమనండి. ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని మంత్రి, కంపెనీ యాజమాన్యం అనుకుంటే సరిపోతుందా, మా ఆవేదన వారికి అవసరం లేదా? ఈ ప్రభుత్వం ఎవరి పక్షాన పనిచేస్తుందో సమాధానం చెప్పాలి.
– శ్రీను, రైతు, పెద్ద ధన్వాడ, జోగుళాంబ గద్వాల