వెల్దండ/చారకొండ/ఊర్కొండ, సెప్టెంబర్ 8 : రంగారెడ్డి జిల్లా లో కురిసిన భారీ వర్షానికి దిగువనున్న వెల్దండ మండలానికి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వెల్దండ మండలం బొల్లంపల్లి కొత్త చెరువు నిండుకుండను తలపిస్తున్నది. వెల్దండ మండలం గాన్‌గట్టుతండా, వెల్దండ-చారకొండ ప్రధాన రహదారిపై భైరాపూర్ వద్ద వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
వెల్దండ తాసీల్దార్ రవికుమార్, సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్సై కురుమూర్తి వంతెనలను పరిశీలించి రాకపోకలు నిలిపివేయించారు. పోచమ్మతండాలో పత్తిపంట నీటమునిగింది. రాచూర్‌లో రజియాబేగం ఇల్లు కూలింది. చారకొండ మండల కేంద్రంతోపాటు శిరుసనగండ్ల, చంద్రాయన్పల్లి, గోకారం, తుర్కలపల్లి, జూపల్లి తదితర గ్రామాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది.
శిరుసనగండ్లలో చింతకుంట చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నది. అదేవిధంగా చారకొండ వాగుపై ఉన్న కత్వా ఉధృతంగా ప్రవహిస్తున్నది.మండలంలో 63.8 వర్షపాతం నమోదు అయినట్లు ఏ ఎస్వో విక్రంరెడ్డి తెలిపారు. ఊర్కొండ మండలంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. మండలంలోని బొమ్మరాజుపల్లి, రాంరెడ్డిపల్లి, జగబోయిన్‌పల్లి, జకినాలపల్లి గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు అలుగుపారాయి. అదే విధంగా పలు చోట్ల వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.